Telugu Global
Telangana

బీజేపీకి అంత సీన్ లేదా..? ఓటమిని బండి ఒప్పుకున్నట్టేనా..?

ఏ సర్వే చూసినా బీజేపీకి 10లోపే సీట్లు అంటున్నాయి. అసలు ఎంఐఎం కంటే ఎక్కువ సీట్లు కూడా రావని పక్కన పెట్టేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ సీఎం అనే హామీతో.. బీసీ వర్గాలను బీజేపీ ఎగతాళి చేసినట్టేనని అంటున్నారు.

బీజేపీకి అంత సీన్ లేదా..? ఓటమిని బండి ఒప్పుకున్నట్టేనా..?
X

బీసీ సీఎం అని బీజేపీ ప్రకటించగానే బండి, ఈటల లాంటి నేతలకు మరింత హుషారు వస్తుందని అనుకున్నారంతా. కానీ అసలు బీజేపీకి అంత సీన్ లేదని మిగతావారికంటే ఎక్కువగా ఆ నేతలకే తెలుసు. అందుకే ఆ వ్యవహారంపై వారెవరూపెద్దగా స్పందించ లేదు, స్పందించినా నైరాశ్యం తప్ప అక్కడింకేమీ లేదు. తాజాగా బీసీ సీఎం వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్, తనకు ఆ ఆశ లేదని తేల్చేశారు.

ఓ దశలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవినుంచి పక్కన పెట్టినందుకే బండి నొచ్చుకున్నారు. ఆ తర్వాత జాతీయ పదవి ఇచ్చినా ఆయన పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఇక బీసీ సీఎం అంటూ అమిత్ షా ప్రకటిస్తే బండికి సంతోషం ఎందుకొస్తుంది..? అసలు తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లెన్ని..? ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా..? అనే ప్రశ్నలకే సమాధానం లేదు, ఇక బీసీ సీఎం అంటే అది అమిత్ షా పేల్చిన జోక్ అనుకోవాల్సిందే. దమ్ముంటే కాంగ్రెస్ ని కూడా బీసీ సీఎం అని ప్రకటించమనండి అంటూ లక్ష్మణ్ వంటి నేతలు సవాళ్లు విసిరినా.. బీజేపీ వ్యాఖ్యల మర్మం ఎవరికీ తెలియంది మాత్రం కాదు. అందుకే బండి సంజయ్ వంటి నేతలు కూడా తమకు సీఎం కుర్చీపై ఆశ లేదంటున్నారు.

సీఎం అభ్యర్థి ఎవరు అనేది ముందే ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేదని అన్నారు బండి సంజయ్. సీఎం పదవిపై తనకు మోజు లేదని తేల్చి చెప్పారు. ఒకరు ఇద్దరు చెప్పినంత మాత్రాన తాను సీఎంను కాలేనని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం చేస్తామని బండి మరోసారి స్పష్టం చేశారు. బండి నైరాశ్యం అర్థం చేసుకున్నవారు మాత్రం బీజేపీ ఓటమిని ఆయన ముందుగానే ఒప్పుకున్నారని అంటున్నారు. ఏ సర్వే చూసినా బీజేపీకి 10లోపే సీట్లు అంటున్నాయి. అసలు ఎంఐఎం కంటే ఎక్కువ సీట్లు కూడా రావని పక్కన పెట్టేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ సీఎం అనే హామీతో.. బీసీ వర్గాలను బీజేపీ ఎగతాళి చేసినట్టేనని అంటున్నారు.

First Published:  5 Nov 2023 9:13 AM GMT
Next Story