Telugu Global
Telangana

కలెక్టరేట్ ముట్టడి యత్నం.. బండి సంజయ్ అరెస్ట్

బ్యారికేడ్లను దాటుకుని వెళ్లడానికి ప్రయత్నించారు సంజయ్. ఈ క్రమంలో పోలీసు వాహనంపై దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

కలెక్టరేట్ ముట్టడి యత్నం.. బండి సంజయ్ అరెస్ట్
X

కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతోపాటు పోలీసు వాహనంపై రాళ్లు రువ్వి, అద్దాలు పగలగొట్టి నానా హంగామా చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి కామారెడ్డి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కలెక్టరేట్ ముట్టడి పేరుతో అనుచరులతో కలసి ఒక్కసారిగా దూసుకొచ్చారు బండి సంజయ్. కలెక్టరేట్ వద్దకు అనుమతి లేదని, కిలో మీటరు దూరంలోనే బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు పోలీసులు. అయినా బ్యారికేడ్లను దాటుకుని వెళ్లడానికి ప్రయత్నించారు సంజయ్. ఈ క్రమంలో పోలీసు వాహనంపై దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ లో భూమి పోతోందనే కారణంతో రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న బండి సంజయ్, రాములు కుటుంబాన్ని పరామర్శించే నెపంతో రాజకీయం మొదలు పెట్టారు. కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రియల్టర్లకు కొమ్ము కాస్తోందని ఆరోపిస్తూ రైతులకు న్యాయం చేయాలంటూ ఆయన ఆందోళనకు దిగారు. కలెక్టర్ కు పనిచేయడం రాకపోతే బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వెంటనే కలెక్టర్ వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు సంజయ్.

సీఎం కేసీఆర్ కామారెడ్డి వచ్చే వరకు తగ్గేది లేదంటూ బండి సంజయ్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఆయనతోపాటు అనుచరులు కూడా కలెక్టరేట్ వద్ద హంగామా సృష్టించారు. పోలీసులతో బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. వెంటనే పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసి కామారెడ్డి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడినుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు.

First Published:  6 Jan 2023 4:06 PM GMT
Next Story