Telugu Global
Telangana

మంత్రి కేటీఆర్ చొరవ.. రంబుల్ స్ట్రిప్స్ కి బ్రేక్

నేరుగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వేసిన చోట రంబుల్ స్ట్రిప్స్ తొలగిస్తున్నారు. కొత్తగా నగరంలో ఇంకెక్కడా వాటిని వేయకూడదని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

మంత్రి కేటీఆర్ చొరవ.. రంబుల్ స్ట్రిప్స్ కి బ్రేక్
X

స్పీడ్ బ్రేకర్లకు ప్రత్యామ్నాయంగా వేగాన్ని నియంత్రించేందుకు వాడుతున్న రంబుల్ స్ట్రిప్స్ పై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రంబుల్ స్ట్రిప్స్ వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గక పోగా, కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. స్వయంగా మంత్రి కేటీఆర్ కి కూడా చాలా సార్లు తమ ఇబ్బందుల్ని తెలిపారు. రంబుల్ స్ట్రిప్స్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్.. అధికారులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతానికి వీటికి బ్రేక్ పడింది. హైదరాబాద్ నగరంలో రంబుల్‌ స్ట్రిప్స్‌ వేయకూడదని GHMC ఈఎన్‌సీ జియావుద్దీన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఈ, ఈఈలకు మెమోలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు రంబుల్‌స్ట్రిప్స్‌ వేయరాదని పేర్కొన్నారు. పాదచారుల భద్రత కోసం జీబ్రా క్రాసింగ్స్‌, స్టాప్‌ లైన్ల వంటి పనులు యధావిధిగా చేయవచ్చని సూచించారు.

ఎందుకీ రంబుల్ స్ట్రిప్స్..

నగరంలో పదే పదే స్పీడ్ బ్రేకర్లు వేస్తే ప్రయాణికులకు ఇబ్బంది అనే కారణంతో వాటికంటే ఎత్తు తక్కువగా ఉండే రంబుల్ స్ట్రిప్స్ వాడకం ఇటీవల పెరిగింది. మితి మీరిన వేగాన్ని అదుపు చేయడంకోసమే వీటిని రోడ్లపై వేసేవారు. వాస్తవానికి వీటి వల్ల వాహనాల వేగం తగ్గి, ప్రయాణం సాఫీగా సాగాలి. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేసిన రంబుల్ స్ట్రిప్స్ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా TSIIC ప్రాంతంలో వేసిన రంబుల్‌స్ట్రిప్స్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. 5 మిల్లీమీటర్ల మందం ఉండాలనే నిబంధనలు ఉండగా నగరంలో ఏకంగా 10నుంచి 15మిల్లీమీటర్ల మందంతో వాటిని వేశారని, మధ్యలో ఉన్న గ్యాప్ కూడా చాలా తక్కువగా ఉందని, దీనివల్ల బైక్ లలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులొచ్చాయి. కొంతమంది నేరుగా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్లో ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన వెంటనే స్పందించి, అధికారుల్ని అలర్ట్ చేసారు.

నేరుగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వేసిన చోట రంబుల్ స్ట్రిప్స్ తొలగిస్తున్నారు. కొత్తగా నగరంలో ఇంకెక్కడా వాటిని వేయకూడదని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

First Published:  17 May 2023 6:43 AM GMT
Next Story