Telugu Global
Telangana

రూ.100 కోట్ల నగదు, కాంట్రాక్టులు ఇస్తామని మభ్యపెట్టారు : బాల్క సుమన్

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని.. కాంట్రాక్టులు కూడా ఇస్తామని చెప్పారని సుమన్ అన్నారు.

రూ.100 కోట్ల నగదు, కాంట్రాక్టులు ఇస్తామని మభ్యపెట్టారు : బాల్క సుమన్
X

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ. 100 కోట్ల నగదు, భారీ కాంట్రాక్టులు ఇస్తామని బీజేపీ ప్రలోభ పెట్టిందని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేయడానికి ఢిల్లీ, తిరుపతి నుంచి వచ్చిన బీజేపీ మధ్య వర్తులు ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. తమను ప్రలోభాలకు గురి చేస్తున్నారని స్వయంగా పోలీసులకు సమాచారం అందించడంతో ఫామ్ హౌస్‌పై దాడి చేసి బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై మునుగోడు ప్రచారంలో ఉన్న బాల్క సుమన్ చండూరులో స్పందించారు.

Advertisement

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని.. కాంట్రాక్టులు కూడా ఇస్తామని చెప్పారని సుమన్ అన్నారు. ఎంత భారీ డబ్బు వెచ్చించి అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారని.. ఈ క్రమంలో ఎమ్మెల్యేలే పోలీసులకు సమాచారం ఇచ్చారని అన్నారు. తెలంగాణ సమాజం అమ్ముడు పోయే సమాజం కాదని బీజేపీ ఇప్పటికైనా గ్రహించాలని హితవు పలికారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ అనేక కుట్రలు చేసింది. కానీ తెలంగాణ బిడ్డలు మాత్రం కేసీఆర్ బాటలోనే నడుస్తారు. వాళ్లు ఎవరి కుట్రలకు బలికారని సుమన్ చెప్పుకొచ్చారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే బీజేపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నరని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్నో దుర్మార్గాలకు పాల్పడుతోందని ఆయన చెప్పారు.

Advertisement

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేరసారాలకు లొంగరు : ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీ బేరసారాలకు లొంగరని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఇది కేసీఆర్ పార్టీ.. దీన్ని ఎవరూ కొనలేరని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని బాలరాజు పేర్కొన్నారు. కాగా, బీజేపీ నేతలు బేరసారాలు కొనసాగించిన వారిలో బాలరాజు కూడా ఉన్నారు. పోలీసులకు ఆయనే సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. అనంతరం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన బాలరాజు మీడియాకు అసలు విషయం చెప్పారు. బీజేపీ కుట్రలను బయటపెట్టడానికే తాము వచ్చామని అన్నారు.

Next Story