బాబూమోహన్, శశిధర్‌రెడ్డి, కృష్ణాయాదవ్.. సీనియర్లందరికీ థర్డ్ లిస్ట్‌లో టికెట్లు
తొలి రెండు జాబితాల్లో పేరు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న బాబూమోహన్‌కు ఆందోల్ టికెట్ ఖరారయింది. సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డికి ఆయన నియోజకవర్గం సనత్‌నగర్ టికెట్ దక్కింది.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు 35 మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాల్లో 52 మందిని ప్రకటించిన బీజేపీ ఇప్పుడు మూడో లిస్ట్ విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు బీజేపీ ఎన్నికల కమిటీ నేతలు చర్చించి ఈ జాబితా ఖరారు చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. తొలి రెండు జాబితాల్లో సీటు దక్కలేదని అసంతృప్తిగా ఉన్న చాలామంది సీనియర్లకు ఈ జాబితాలో ఓదార్పు దక్కింది.
సీనియర్లకు చోటు
తొలి రెండు జాబితాల్లో పేరు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న బాబూమోహన్‌కు ఆందోల్ టికెట్ ఖరారయింది. సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డికి ఆయన నియోజకవర్గం సనత్‌నగర్ టికెట్ దక్కింది. మాజీ మంత్రి, ఇటీవలే బీజేపీలో చేరిన కృష్ణాయాదవ్‌కు అంబర్‌పేట టికెట్ కేటాయించారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన హిమాయత్‌నగర్ నియోజకవర్గమే పునర్విభజన తర్వాత అంబర్‌పేటగా మార్పు చెందింది. మరో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నానికి చేవెళ్ల అభ్యర్థిత్వం ఖరారు చేశారు. 2009 నుంచి ఆయన ఇక్కడ ఏదో ఒక ప్రధాన పార్టీ తరఫున పోటీ చేస్తుండటం గమనార్హం. పార్టీ సీనియర్ నేత ఎన్‌వీవీఎస్ఎస్ ప్రభాకర్‌కు ఆయన గతంలో పోటీ చేసిన గెలిచిన ఉప్పల్ స్థానానికి అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు.
బాన్సువాడకు యండల, ఎల్బీనగర్‌కు సామ రంగారెడ్డి
మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత యండల లక్ష్మీనారాయణకు బాన్సువాడ టికెట్ ఖరారు చేసింది. ఎల్బీనగర్ స్థానానికి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అభ్యర్థిగా ఎంపికయ్యారు. జర్నలిస్ట్ సంగప్పకు నారాయణ్‌ఖేడ్ టికెట్ ఇచ్చారు. నగర బీజేపీలో తరచూ వార్తల్లో కనిపించే మేకల సారంగపాణికి సికింద్రాబాద్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. మంథనిలో గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, ఇప్పుడు బీజేపీలో చేరిన చంద్రుపట్ల సునీల్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు.