Telugu Global
Telangana

అజారుద్దీన్ Vs విష్ణువర్థన్ రెడ్డి.. కాంగ్రెస్‌లో మొదలైన టికెట్ల గొడవ

జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ తనయుడు పి. విష్ణువర్థన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.

అజారుద్దీన్ Vs విష్ణువర్థన్ రెడ్డి.. కాంగ్రెస్‌లో మొదలైన టికెట్ల గొడవ
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల్లో టికెట్ల కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పలు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉన్నది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం పెరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నికలకు సమాయాత్తం చేయడానికి ఇప్పటికే ఎలక్షన్ కమిటీని కూడా ప్రకటించారు. త్వరలోనే ఎలాంటి వివాదం లేని 40 నుంచి 50 నియోజకవర్గాలకు జాబితాను కూడా ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పరిధిలోని ఒక కీలక నియోజకవర్గంలో టికెట్ల కోసం ఇద్దరు సీనియర్లు రచ్చకు ఎక్కారు.

జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ తనయుడు పి. విష్ణువర్థన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణు.. 2014, 2018లో మాత్రం మాగంటి గోపీనాథ్‌పై ఓడిపోయారు. కానీ, నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కులా ఉన్నారు. 2018లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగానే ఉన్నారు. గాంధీభవన్‌లో కూడా ఎప్పుడూ కనిపించిన విష్ణు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల ఆయన బీజేపీలోకి మారతాయనే వార్తలు వచ్చినా.. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ప్రకటించారు.

తన సోదరి విజయారెడ్డి కాంగ్రెస్‌లో జాయిన్ అయినప్పుడు కూడా విష్ణువర్థన్ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. తనకు ఆహ్వానం అందలేని వ్యాఖ్యానించడంతో పార్టీని వీడతారనే అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా పలు మార్లు కామెంట్లు చేశారు. అయితే పార్టీలోని సీనియర్లు అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, హన్మంతరావుతో విష్ణు టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తాజాగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ పర్యటించడం వివాదాస్పదం అయ్యింది. తనకు చెప్పకుండా జూబ్లీహిల్స్‌లో పర్యటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ కొరకు ప్రాణాలు అర్పించే మనస్తత్వం నాది. అజారుద్దీన్ తనకు చెప్పకుండా జూబ్లీహిల్స్‌లో పర్యటించడం తప్పు. ఈ సారి వస్తే.. ముందస్తు సమాచారం ఇవ్వండి. రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తానంటూ విష్ణు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తన తండ్రి 30 ఏళ్ల పని చేసి ఎన్నో త్యాగాలు చేశారు. తనకు కాకుండా జూబ్లీహిల్స్ టికెట్ వేరే వాళ్లకు ఇస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు.

కాగా, అజారుద్దీన్ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఏనాడూ పాల్గొనలేదు. అయితే ఇటీవల అధిష్టానం ప్రకటించిన ఎన్నికల కమిటీలో ఆయన పేరు కనపడింది. దీంతో ఈ సారి అజార్ తెలంగాణ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన జూబ్లీహిల్స్ మీద ఫోకస్ చేసినట్లు కూడా సన్నిహితులు చెబుతున్నారు. రెండు సార్లు వరుసగా ఓడిపోయిన విష్ణువర్థన్ రెడ్డిని పక్కన పెట్టి.. అజారుద్దీన్‌కు టికెట్ ఇస్తారనే చర్చ జరుగుతోంది. అధిష్టానానికి కూడా అజారుద్దీన్ సన్నిహితుడు కావడంతో ఈ సారి విష్ణుకు నిరాశ తప్పదనే అంటున్నారు. అందుకే అజారుద్దీన్ తన నియోజకవర్గంలో పర్యటించడాన్ని విష్ణు సహించలేక పోయారు. మరి టికెట్ల ప్రకటన నాటికి జూబ్లీహిల్స్‌లో పోటీకి మరెంత మంది క్యూ కడతారో చూడాలి.

First Published:  10 Aug 2023 8:17 AM GMT
Next Story