Telugu Global
Telangana

అజారుద్దీన్ ఎన్నికైన దగ్గర నుంచి వివాదాలే.. దిగిపోయే ముందు మరో రచ్చ

అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు అయ్యాక ఇక్కడ కేవలం ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. 2019 డిసెంబర్ 6న ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత మళ్లీ ఈ నెల 25న ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగనుంది.

అజారుద్దీన్ ఎన్నికైన దగ్గర నుంచి వివాదాలే.. దిగిపోయే ముందు మరో రచ్చ
X

క్రికెటర్‌గా ఎన్నో రికార్డులు నెలకొల్పిన మహ్మద్ అజారుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అంతకు మించిన వివాదాలు సృష్టించారు. 2019లో హెచ్‌సీఏ ప్రెసిండెట్‌గా ఎన్నికైన దగ్గర నుంచి పాలక వర్గంతో నిత్యం గొడవల్లో మునిగితేలారు. ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్‌తో నిత్యం పేచీలే. తన ఇష్టారాజ్యంగా అంబుడ్స్‌మెన్‌ను నియమించారని అజారుద్దీన్‌పై ఏకంగా హైకోర్టులో కేసు వేశారు. హెచ్‌సీఏ పాలక వర్గ సమావేశాలు కూడా సరైన సమయంలో నిర్వహించకపోవడం, ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు సంబంధించిన కరెంట్ బిల్లులు కూడా చెల్లించకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ పాలనంతా వివాదాస్పదమే. ఇక ఈ నెలాఖరుతో అజారుద్దీన్ పదవీ కాలం ముగుస్తుందనగా.. టికెట్ల విక్రయాల రచ్చ హెచ్‌సీఏ ప్రతిష్టను పూర్తిగా మంటగలిపింది.

అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు అయ్యాక ఇక్కడ కేవలం ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. 2019 డిసెంబర్ 6న ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత మళ్లీ ఈ నెల 25న ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగనుంది. మధ్యలో కరోనా కారణంగా కొన్నాళ్లు మ్యాచ్‌ల నిర్వహణకు బ్రేక్ పడింది. అయితే తిరిగి అంతర్జాతీయ మ్యాచ్‌లు ప్రారంభమైన తర్వాత కూడా హైదరాబాద్ ఒక్క మ్యాచ్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పరిధిలోని విశాఖపట్నంలో చెప్పుకోదగిన స్థాయిలోనే మ్యాచ్‌లు జరిగాయి. కానీ, హెచ్‌సీఏకు మ్యాచ్‌లు కేటాయించడానికి బీసీసీఐ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. గత మూడేళ్లుగా హెచ్‌సీఏను చుట్టుముట్టిన వివాదాలపై బోర్డు కూడా ఆగ్రహంగా ఉంది. ఇక్కడి పాలకవర్గ సభ్యులు ఒకరిపై ఒకరు బోర్డు కార్యదర్శి జై షాకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు.

ఇటీవల ఉప్పల్ స్టేడియం, హెచ్‌సీఏ కార్యాలయానికి సంబంధించిన రూ. 3 కోట్ల కరెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో స్టేడియంకు కరెంట్ కట్ చేస్తామని విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా హెచ్‌సీఏ ఉద్యోగులు, గ్రౌండ్ సిబ్బందికి జీతభత్యాలు కూడా సరైన సమయంలో చెల్లించడం లేదనే ఆరోపణలు వచ్చాయి. దీనికి కారణం అజారుద్దీన్, విజయానంద్ మధ్య సఖ్యత లేకపోవడమే అని తెలుస్తుంది. చెక్కులపై ప్రెసిడెంట్, సెక్రటరీ సంతకాలు కావల్సి ఉండగా.. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాలన కుంటుపడింది. ఇక అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మను గత ఏడాది ఏప్రిల్‌లో అజారుద్దీన్ నియమించారు. అయితే అసోసియేషన్ సభ్యుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా అజారుద్దీన్ వ్యవహరించారని హైకోర్టుకు వెళ్లారు.

ఇక పాలక వర్గాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నలుగురు సభ్యుల స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో ఇటీవల విజయానంద్, జాన్ మనోహర్ అసోసియేషన్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు అజారుద్దీన్ అంతా తానై నడిపిస్తున్నారు. అయితే అసోసియేషన్‌కు పూర్తి స్థాయి సీఈవో, సీవోవో లేకపోవడంతో మ్యాచ్‌ల నిర్వహణ కష్టంగా మారింది. అసోసియేషన్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించిన అనుభవం కూడా అజారుద్దీన్‌కు లేకపోవడంతోనే గురువారం అంత రచ్చ జరిగిందని అంటున్నారు. ముందస్తుగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా.. ఎంతో కొంత సాయం అందేదని.. కానీ పంతానికి పోయిన అజార్.. పలువురి ప్రాణాల మీదకు తెచ్చారనే విమర్శలు వస్తున్నాయి.

టీమ్ ఇండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లకు పేటీఎం స్పాన్సర్‌గా ఉండటంతో అదే ప్లాట్‌ఫామ్ మీద టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే మ్యాచ్‌కు ముందు టికెట్ల విక్రయాలకు సంబంధించిన వివరాలను హెచ్‌సీఏ వెల్లడించలేదు. సరైన సమాచారం లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. 20 మంది గాయపడటానికి ఆయన వ్యవహారశైలే కారణమని చెబుతున్నారు. మరోవైపు బీసీసీఐ కూడా హెచ్‌సీఏ పట్ల ఆగ్రహంతో ఉన్నది. టికెట్ల విషయంలో జరిగిన వివాదంపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. మొత్తానికి మరో వారం రోజుల్లో పదవీ కాలం ముగుస్తుందనగా.. అజారుద్దీన్ ఎక్కడ లేని అపఖ్యాతిని మూటగట్టుకున్నారు.

First Published:  23 Sep 2022 2:57 AM GMT
Next Story