Telugu Global
Telangana

అవినాష్ ఉత్కంఠ.. మరో రోజు కొనసాగింపు

విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయాన్ని వెలువరించింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాదనలు ప్రారంభించి విచారణ చేపడతామని తెలిపింది.

అవినాష్ ఉత్కంఠ.. మరో రోజు కొనసాగింపు
X

అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఈరోజు కీలక ఘట్టం ఉంటుందని అనుకున్నారంతా. కానీ తెలంగాణ హైకోర్ట్ ఆ సస్పెన్స్ ని మరో రోజు పొడిగించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు సంబంధించి కడప ఎంపీ అనివాష్‌ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ పై విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రేపు(శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు అందరి వాదనలు వింటామని హై కోర్టు తెలిపింది.

వాదనలకు ఎంత సమయం పడుతుందనీ సీబీఐని ముందుగా హైకోర్టు అడిగింది. గంటసేపు వాదనలు వినిపిస్తామని సీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయాన్ని వెలువరించింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాదనలు ప్రారంభించి విచారణ చేపడతామని తెలిపింది.

అవినాష్‌ రెడ్డి పిటిషన్‌ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ విచారణ ఘట్టం మొదలైంది. ఈసారి విచారణకు పిలిపిస్తే అవినాష్ రెడ్డిని కచ్చితంగా అరెస్ట్ చేస్తారనే పుకార్లు మొదలయ్యాయి. వాటికి బలం చేకూరుస్తూ ఇటీవల సీబీఐ అధికారులు పులివెందుల, కర్నూలులో హడావిడి చేశారు. రేపటి కోర్టు తీర్పు తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేక కేవలం విచారణ మాత్రమే చేపడతారా అనేది తేలిపోతుంది.

Next Story