Telugu Global
Telangana

తెలంగాణలో కోటి జెండాలతో జెండా పండుగ‌..

ఆగస్ట్ 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే విధంగా ప్రణాళక రూపొందించారు. దీనికోసం ప్రభుత్వం కోటి జెండాలు తయారు చేయించి ఇంటింటికీ పంపిణీ చేయించబోతోంది.

తెలంగాణలో కోటి జెండాలతో జెండా పండుగ‌..
X

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రెండు వారాలపాటు ఈ కార్యక్రమాలుంటాయి. నిర్వాహక కమిటీ ఛైర్మన్‌ గా కె.కేశవరావు వ్యవహరిస్తారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 15 రోజుల పాటు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారాయన. ఆగస్ట్ 8న హెచ్‌ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఆగస్ట్ 22న ఎల్బీస్టేడియంలో భారీ ఎత్తున ముగింపు వేడుకలు జరుగుతాయి. ఆగస్ట్ 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే విధంగా ప్రణాళక రూపొందించారు. దీనికోసం ప్రభుత్వం కోటి జెండాలు తయారు చేయించి ఇంటింటికీ పంపిణీ చేయించబోతోంది.

ఉత్సవాలపై సమీక్ష..

కేకే అధ్యక్షతన బీఆర్కే భవన్ లో వజ్రోత్సవ నిర్వాహక కమిటీ సమావేశమైంది. మంత్రి తలసాని సహా ఇతర నేతలు, అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు, అమరవీరుల త్యాగాలను భవిష్యత్ తరానికి తెలియజేసేందుకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు తెలిపారు నేతలు. హెచ్‌ఐసీసీలో జరిగే ప్రారంభోత్సవాల్లో పోలీస్‌ బ్యాండ్‌, కళారూపాల ప్రదర్శన ఉంటుందన్నారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు, సినిమాహాళ్లలో దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శిస్తామని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో వక్తృత్వ, వ్యాస రచనతోపాటు ఇతర పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌ లో ఒక రోజు భారీ ఎత్తున జానపదాల ప్రదర్శన.. మరో రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కూడళ్లలో ఒకేమారు జాతీయ గీతాలాపన ఉంటుంది. హైదరాబాద్‌ లోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి నెక్లెస్‌ రోడ్‌ మీదుగా సంజీవయ్య పార్కులోని జాతీయజెండా వరకు భారీ ర్యాలీ చేపడతారు. 22న జరిగే ముగింపు వేడుకలకు ఒక్కో జిల్లా నుంచి రెండువేల మంది హాజరవుతారని అంచనా. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణను త్వరలో సీఎం కేసీఆర్ విడుదల చేస్తారని తెలిపారు నేతలు. రాజధాని నగరంతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

First Published:  28 July 2022 7:29 AM GMT
Next Story