Telugu Global
Telangana

కేటీఆర్‌ ఆడియో వైరల్‌.. అందులో ఏం చెప్పారంటే..!

సిరిసిల్లలో 2018 ఎన్నికల్లో 89 వేల మెజార్టీతో విజయం సాధించిన కేటీఆర్‌.. ఈ సారి అంతకుమించి సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలతో ఆయన అలర్ట్ అయ్యారు.

కేటీఆర్‌ ఆడియో వైరల్‌.. అందులో ఏం చెప్పారంటే..!
X

తెలంగాణ ఎన్నికల ప్రచారం ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. మరో 5 రోజుల్లో ప్రచారపర్వానికి తెరపడనుంది. దీంతో వీలైనంతగా ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే తాజాగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సిరిసిల్లలో 2018 ఎన్నికల్లో 89 వేల మెజార్టీతో విజయం సాధించిన కేటీఆర్‌.. ఈ సారి అంతకుమించి సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలతో ఆయన అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ నేతలతో రివ్యూ నిర్వ‌హించారు. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ ఆడియో క్లిప్‌ను ఆసరాగా చేసుకుని కేటీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా.. కార్యకర్తలతో మాట్లాడిన ఆడియోలో తప్పు ఏం ఉందంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది.

ఇంతకీ ఆడియోలో ఏముందంటే..

ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉందని.. ఇంటింటికి ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు కేటీఆర్‌. గాలివార్తలు, బయట వాడొకడు, వీడొకడు మాట్లాడే మాటలు పట్టించుకోవద్దని సూచించారు. ఇప్పటికే 15 మంది కౌన్సిలర్లతో తాను మాట్లాడానని.. సర్పంచ్‌లతోనూ మాట్లాడానంటూ చెప్పుకొచ్చారు. కేటీఆర్ మెజార్టీ తగ్గుతుందట అని మనవాళ్లే ప్రచారం చేసి పది మందిని ఖరాబ్ చేస్తున్నారన్నారు కేటీఆర్. దయచేసి అలాంటి పని చేయొద్దంటూ సూచించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మహేందర్ రెడ్డి అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు, ఆ కులం వాళ్లు మనకు ఓటేయరట అన్న ప్రచారాలు బంద్‌ చేయాలని కోరారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి ఎవరైనా తిరగుతారన్నారు కేటీఆర్‌. గతంలో మాదిరిగా కాకుండా వచ్చే టర్మ్‌లో వారంలో రెండు రోజులు సిరిసిల్లలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ వారం రోజులు కష్టపడాలని శ్రేణులను కోరారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతున్నాడంటూ ఓ పేపర్‌లో రాశారని.. ఆ స్థాయికి వెళ్లిందంటే అది మనవాళ్ల ప్రచారం వల్లేనన్నారు. వారం రోజులు శ్రద్ధతో డోర్‌ టు డోర్‌ ప్రచారం చేయాలని కోరారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్‌లు ఇస్తామని చెప్పాలన్నారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్లలో వచ్చే మెజార్టీ వైపే చూస్తుందని.. ఎవరూ ఏ మాత్రం నిర్లక్ష్యం గా ఉండవద్దని సూచించారు.

First Published:  23 Nov 2023 3:56 AM GMT
Next Story