Telugu Global
Telangana

తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన అట్టెరో ఇండియా

తెలంగాణలో 600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అట్టెరో ఇండియా కంపెనీ సిద్ధమైంది. ఈమేరకు మంత్రి కేటీఆర్ తో ఆ సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన అట్టెరో ఇండియా
X

తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఓవైపు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్నా, మరోవైపు పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ రాష్ట్రానికి పెట్టుబడులు సాధిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఆయన కృషి ఫలితంగా మరో పెద్ద ప్రాజెక్ట్ తెలంగాణ తలుపు తట్టింది. అట్టెరో ఇండియా.. తెలంగాణలో 600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు మంత్రి కేటీఆర్ తో అట్టెరో ఇండియా ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు.


అట్టెరో ఏం చేస్తుంది..?

అట్టెరో ఇండియా అనేది ఈ వేస్ట్ రీసైక్లింగ్ సంస్థ. నొయిడా ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన అట్టెరో ఇండియా.. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ సంస్థ త్వరలో అమెరికా, ఇండోనేషియా, యూరప్ లో రీసైక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తోంది. 2027నాటికి 3లక్షల టన్నుల లిథియం అయాన్ బ్యాటరీలను రీసైకిల్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇక రాబోయే ఐదేళ్లలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అట్టెరో ఇండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఈ వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది.

600కోట్ల పెట్టుబడి..

600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సంస్థ తెలంగాణలో ప్రవేశిస్తోంది. అట్టెరో ఇండియా ఫెసిలిటీ సెంటర్‌ ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, మరో 500మందికి పరోక్షంగా ఉపాధి లభించబోతోంది. హైదరాబాద్‌ లో మంత్రి కేటీఆర్‌ తో సమావేశమైన అట్టెరో ఇండియా ప్రతినిధులు ఈమేరకు ఒప్పంద పత్రాలు అందించారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం రెడ్ కార్పెట్ పరుస్తోందని, అట్టెరో ఇండియాకి స్వాగతం పలకడం సంతోషంగా ఉందని అన్నారు మంత్రి కేటీఆర్.

First Published:  31 Oct 2022 3:41 PM GMT
Next Story