Telugu Global
Telangana

టీఆరెస్ నాయకుడి హత్యతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తం.. సీపీఎం నేతల ఇళ్లపై దాడులు

ఖమ్మంజిల్లాలో టీఆరెస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కృష్ణయ్య అనుచరులు సీపీఎం నాయకుల ఇళ్ళపై దాడులకు దిగారు.

టీఆరెస్ నాయకుడి హత్యతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తం.. సీపీఎం నేతల ఇళ్లపై దాడులు
X

టీఆరెస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా ఉద్రిక్తంగా మారింది. ఈ హత్యకు ప్రతీకారంగా ముఖ్యంగా తెల్లారపల్లి లో సీపీఎం నేతల ఇళ్లపై కృష్ణయ్య అనుచరులు దాడికి దిగారు. సీపీఎం దిమ్మెలను బండరాళ్లతో నాశనం చేశారు. తమ్మినేని సోదరుడు కోటేశ్వరరావు ఇంటి కిటికీలను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తన ప్రధాన అనుచరుడైన కృష్ణయ్య మృత దేహానికి నివాళి అర్పించారు. తమ్మినేని వీరభద్రం కుటుంబానికి, కృష్ణయ్యకు మధ్య చాలాకాలంగా కుటుంబ తగాదాలున్నాయి. వీరభద్రం బాబాయి కుమారుడైన కృష్ణయ్య మొదట సీపీఎంలో కొనసాగినప్పటికీ.. ఆ తరువాత ఆ పార్టీని వదిలి టీఆరెస్ లో చేరిన తరువాత రెండు కుటుంబాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. కృష్ణయ్య హత్య రాజకీయ కోణంలో జరిగిందా, లేక పాత కక్షల మూలంగానా అన్నది తేలాల్సి ఉంది. తెల్లారపల్లిలో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.

నా భర్తను తమ్మినేని వీరభద్రం హత్య చేయించారు.. కృష్ణయ్య భార్య మంగతాయారు

తన భర్తను తమ్మినేని వీరభద్రం హత్య చేయించారని కృష్ణయ్య భార్య మంగతాయారు ఆరోపిస్తున్నారు. కృష్ణయ్య రాజకీయంగా ఎదగడాన్ని సహించలేక వీరభద్రం ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భర్తను అడ్డుకున్నారని ఆమె వాపోయారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని మంగతాయారు కోరుతున్నారు. ఎంపీటీసీగా కొనసాగుతున్న ఈమె.. ఈ హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.




First Published:  15 Aug 2022 11:44 AM GMT
Next Story