Telugu Global
Telangana

ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యం.. పోలీసుల అదుపులో ఉన్న కార్యకర్తలను తీసుకెళ్లిన రెహ‌మత్ బేగ్

జంతువులను అక్రమంగా తరలిస్తుండడం వల్లే వారిని అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నప్పటికీ రెహ‌మత్ బేగ్ పట్టించుకోలేదు.

ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యం.. పోలీసుల అదుపులో ఉన్న కార్యకర్తలను తీసుకెళ్లిన రెహ‌మత్ బేగ్
X

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ‌మత్ బేగ్ రెచ్చిపోయారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకువస్తారా..? అంటూ హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ కేసు విషయమై అదుపులోకి తీసుకున్న ఎంఐఎం కార్యకర్తలను దౌర్జన్యంగా స్టేష‌న్ నుంచి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు ఎమ్మెల్సీపై కేసు నమోదు చేశారు.

కొందరు వ్యక్తులు జంతువులను అక్రమంగా తరలిస్తున్నట్లు లాలాగూడ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఎంఐఎం పార్టీకి చెందిన కార్యకర్తలుగా గుర్తించిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. ఈ విషయం ఎంఐఎం ఎమ్మెల్సీ రెహ‌మత్ బేగ్‌కు తెలియడంతో ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

జంతువులను అక్రమంగా తరలిస్తుండడం వల్లే వారిని అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నప్పటికీ రెహ‌మత్ బేగ్ పట్టించుకోలేదు. పోలీసులు వారిస్తున్నా వినకుండా స్టేషన్‌లో ఉన్న ఎంఐఎం కార్యకర్తలను తన వెంట తీసుకువెళ్లారు. కేసు నమోదై పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితులను ఎమ్మెల్సీ దౌర్జన్యంగా తీసుకువెళ్లడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. డీసీపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారంటూ ఎమ్మెల్సీ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

First Published:  22 Jun 2023 4:22 PM GMT
Next Story