Telugu Global
Telangana

పోటీ పరీక్షలు - బుర్ఖా వివాదం.. అసదుద్దీన్ ఏమన్నారంటే..?

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బుర్ఖాకు అనుమతి ఇస్తే, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోందన్నారు అసదుద్దీన్. కాంగ్రెస్ కి తెలంగాణలో అధికారాన్నిస్తే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు తలెత్తుతాయని విమర్శించారు.

పోటీ పరీక్షలు - బుర్ఖా వివాదం.. అసదుద్దీన్ ఏమన్నారంటే..?
X

కర్నాటకలో కాంగ్రెస్‌ ను గెలిపించిన ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. పోటీ పరీక్షలకు బుర్ఖా ధరించి హాజరుకావద్దని కర్నాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చిందని విమర్శించారు. తొమ్మిదన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో బుర్ఖా ధరించి పరీక్షలకు వెళ్తే ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బుర్ఖాకు అనుమతి ఇస్తే, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోందన్నారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ కి తెలంగాణలో అధికారాన్నిస్తే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు తలెత్తుతాయని విమర్శించారు అసదుద్దీన్. వికారాబాద్‌ లోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌ లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు.

కేసీఆర్ ని హ్యాట్రిక్ సీఎం చేయాలి..

తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. రాష్ట్రం సస్యశ్యామలంగా, ప్రశాంతంగా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతిచ్చి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. తొమ్మదిన్నరేళ్ల అభివృద్ధిని చూసి డిసెంబర్‌ 30న ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం షాదీ ముబారక్‌ కింద రూ.2,340 కోట్ల నిధులిచ్చిందని, 205 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు అసదుద్దీన్. 14 లక్షల మంది విద్యార్థులకు రూ.474 కోట్ల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సీఎం ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద 3,224 మంది ముస్లింలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారన్నారు.

రేవంత్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. రేవంత్‌ రెడ్డి బతికి ఉన్నంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌ తోనే ఉంటారని, ఆయనను కాంగ్రెస్‌లోకి పంపింది ఆ సంస్థేనని అన్నా రు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్‌ అయిన రేవంత్‌ ను కొడంగల్‌ లో చిత్తుగా ఓడించాలని ఎంఐఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. గోషామహల్‌ లో బీజేపీకి కాంగ్రెస్ మద్దతిస్తోందన్నారు అసదుద్దీన్. వయనాడ్‌ లో రాహుల్‌ గాంధీ తిరిగి పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు.

First Published:  15 Nov 2023 6:20 AM GMT
Next Story