Telugu Global
Telangana

నీ అడ్రస్ ఎక్కడ..? మీ సంగతేంటి..? రేవంత్ వర్సెస్ అసదుద్దీన్

ఆ మాటకొస్తే అసలు రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టారని ప్రశ్నించారు. సోనియా ఏ దేశం నుంచి వచ్చారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డిలోని ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనం అని విమర్శించారు అసదుద్దీన్.

నీ అడ్రస్ ఎక్కడ..? మీ సంగతేంటి..? రేవంత్ వర్సెస్ అసదుద్దీన్
X

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరింది. నీ అడ్రస్ ఎక్కడ అని రేవంత్ ప్రశ్నిస్తే, అసలు మీ నేతల సంగతి చెప్పు.. అంటూ అసద్ బదులిచ్చారు. తెలంగాణ ఎన్నికల హడావిడి మొదలైన తర్వాత ఎంఐఎం నుంచి పెద్దగా చడీచప్పుడు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తూ అసదుద్దీన్ తెరపైకి వచ్చారు. రేవంత్ రెడ్డి సినిమా మొత్తం తమ దగ్గర ఉందని అన్నారాయన.

గొడవేంటి..?

అసదుద్దీన్‌ది అసలు తెలంగాణ కాదని, ఆయన కుటుంబం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో గొడవ మొదలైంది. రేవంత్ వ్యాఖ్యలకు అసద్ గట్టిగానే బదులిచ్చారు. తన తాత ముత్తాతలు ఈ దేశంలోనే పుట్టారని, తనది కూడా ఇదే దేశం అని చెప్పారు. ఆ మాటకొస్తే అసలు రాహుల్ గాంధీ ఎక్కడ పుట్టారని ప్రశ్నించారు. సోనియా ఏ దేశం నుంచి వచ్చారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డిలోని ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనం అని విమర్శించారు అసదుద్దీన్.

నీ సినిమా అంతా మా దగ్గరుంది..

రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని, ముందు ఏబీవీపీ నుంచి ఆర్ఎస్ఎస్ లో చేరారని, ఆ తర్వాత బీజేపీ వాళ్లు ఆయన్ను టీడీపీలోకి పంపించారని, అక్కడ పని పూర్తి కావడంతో కాంగ్రెస్ గూటికి చేరారని చెప్పారు అసదుద్దీన్ ఒవైసీ. రేవంత్ రెడ్డి జీవితమంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తోనే ముడిపడి ఉందన్నారు. దశాబ్థాల పాటు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి తిరిగారని అన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి తో కలిసి రేవంత్ రెడ్డి పనిచేయడం తనకు తెలుసన్నారు అసదుద్దీన్ ఒవైసీ.

First Published:  7 Oct 2023 10:30 AM GMT
Next Story