Telugu Global
Telangana

ఆరోగ్య మహిళ: తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ కానుక

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 8న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.

ఆరోగ్య మహిళ: తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ కానుక
X

మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేక కానుక ప్రకటించారు. ‘ఆరోగ్య మహిళ’ పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 8న మహిళా దినోత్సవంతో ప్రారంభమై.. ఆ తర్వాత ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్యసేవలు అందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తామని, వైద్యం అందిస్తామని చెప్పారు.

‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రమంతటా విస్తరించాలని చూస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఉన్నతాధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు.. ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 8న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.


షుగర్, బీపీ, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలతో పాటు ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ టెస్ట్ లు కూడా ప్రతి మంగళవారం నిర్వహిస్తారు. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ లోపం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు ఉచితంగా చేసి చికిత్స అందిస్తారు. వాటికి సంబంధించిన మందుల్ని ఆయా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందిస్తారు.

ప్రత్యేక యాప్..

‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం కోసం ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు ప్రత్యేక యాప్‌ ద్వారా వాటిని పర్యవేక్షిస్తారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు మంత్రులు. ఆయా సమస్యలతో బాధపడే మహిళలకు పూర్తిగా నయం అయ్యే వరకు వైద్య సేవలు కొనసాగుతాయని తెలిపారు. రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

First Published:  5 March 2023 6:40 AM GMT
Next Story