Telugu Global
Telangana

ఈ ప్రయత్నాలన్నీ మతకలహాలు సృష్టించడానికేనా?

తెలంగాణ బీజేపీ నేతల ప్రయత్నాలన్నీ మతకలహాలు సృష్టించేందుకేనా ? ప్రజల మధ్య చీలికలు తెచ్చి ఓట్లు దండుకోవాలనే ప్రణాళికను వాళ్ళు అమలుపరుస్తున్నారా ?

X

తెలంగాణలో రాజకీయ వేడి ఆవిర్లు కక్కుతున్నది. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో జరిగిన దాడులు, హింస కేంద్ర పోలీసు బలగాలను దింపి వాటి మాటున బీజేపీ సాగించిన అరాచకం గుర్తొచ్చి తెలంగాణ ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నిక, ఆ తర్వాత జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ చేస్తున్న హడావుడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నది. హైదరాబాద్ లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో జరిగినప్పుడు బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టిన తీరు చూసిన వాళ్ళకు ఆ పార్టీ కచ్చితంగా హింసను కోరుకుంటోందని అర్దమవుతుంది. దాడులు చేస్తామని రెచ్చగొట్టడం, మహ్మద్ ప్రవక్తను తిడతాను ఏం చేస్తారంటూ బీజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసరడం, చివరకు ఫారూఖీ షోపై దాడి చేయడానికి వందల మంది బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడం దేనికి సంకేతం ?

Advertisement

ఫారూఖీ షో అయిపోగానే ఈ రచ్చ కూడా ఆగిపోతుందనుకున్నాం కానీ బీజేపీ కానీ, రాజా సింగ్ కానీ ఆ విషయాన్ని వదిలేయకుండా ఒక వర్గాన్ని రెచ్చగొట్టి మతకలహాలు సృష్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరకు నిన్న మహ్మద్ ప్రవక్తపై అసభ్యకరంగా మాట్లాడి ముస్లింల మనోభావాలను కించపర్చారు. నిన్నటి నుండి హైదరాబాద్ లో ముస్లిం లు అనేక చోట్ల నిరసన ప్రదర్శన‌లు చేస్తూ ఉన్నారు. బీజేపీ తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతకలహాలు రెచ్చగొట్టే ప్రయత్నమే ఇది అని అనుమాలు కలుగుతున్నాయి.

Advertisement

ఇది ఒక్క రాజా సింగ్ తో ఆగిపోలేదు. ఎక్కడ వీలైతే అక్కడ గొడవలు సృష్టించడానికి, హింస రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంత్య క్రియల సందర్భంగా హిందువులు భగవత్గీత వినిపిస్తే, వింటే దాడులు చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బెదిరించడం రెచ్చగొట్టడంలో భాగంకాదా ?

ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో టీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడికి తెగబడటం దేనిని సూచిస్తోంది? నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది కానీ ఇంటిపైకి దాడికి వెళ్ళడాన్ని ఎలా సమర్దించగలం? పైగా దాడికి దిగినవారిని పోలీసులు అరెస్టు చేస్తే దాన్ని సాకుగా చూపి రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్టు అనుమానం. ఆ పేరుతో బండి సంజయ్ ఈ రోజు నడి రోడ్డుపై కూర్చొని ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. అందుకు పోలీసులు అరెస్టు చేస్తే... బీజేపీ కార్యకర్తలంతా ఇళ్ళలోంచి బైటికి రావాలంటూ ఇక ఒక్కరు కూడా ఇళ్ళలో ఉండొద్దని, యుద్దం మొదలయ్యింది తేల్చుకుందాం రమ్మంటూ పిలుపునివ్వడం హింసను రెచ్చగొట్టడం కాదా ?

చాలా ఏళ్ళుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో హింసను రెచ్చగొట్టే ఈ ప్రయత్నం నిజంగానే ప్రజలను భయపెడుతోంది. కర్ఫ్యూలతో, కాల్పులతో అల్లకల్లోలంగా ఉండే ఒకప్పటి హైద్రాబాద్ ను గుర్తు చేసుకొని జనం వణికిపోతున్నారు. ఈ అంశంపై ఎమ్ ఐ ఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సీరియస్ గా స్పందించారు. హైదరాబాద్, తెలంగాణలో మతకలహాలు సృష్టించడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన అసభ్య వ్యాఖ్యలపై మండిపడుతున్న ప్రజలను చల్లార్చడానికి తాను అనేక కష్టాలు పడుతున్నట్టు ఆయన చెప్పారు.

చివరగా ఒక్క మాట.. బీజేపీ అగ్రనేత , కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి ఇక్కడి స్థానిక నేతలతో మంతనాలు చేసి వెళ్ళిపోయిన తర్వాతనే ఈ విధమైన హింసాయుత వాతావరణం ఏర్పడటం యాదృచ్చికం అనుకోవాలా ?

Next Story