Telugu Global
Telangana

భట్టి పాదయాత్రలో చింతమనేని ఏం చేస్తున్నారు?

మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం `ఆజాదీ కా గౌరవ్` యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వైరా నియోజకవర్గంలో ఆయన యాత్ర జరుగుతుండగా.. చింతమనేని అక్కడ ప్రత్యక్షం అయ్యారు.

భట్టి పాదయాత్రలో చింతమనేని ఏం చేస్తున్నారు?
X


తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న వేళ ఇద్దరి నేతల కలయిక ఆసక్తిరేపుతోంది. రెండు వేర్వేరు రాజకీయ పార్టీలు, రాష్ట్రాలకు చెందిన నేతలు బహిరంగంగా కలవడం ప్రధాన మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరున్న మల్లు భట్టి విక్రమార్క.. ఏపీలో అత్యంత వివాదాస్పద నాయకుడిగా పేరున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలిశారు. మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం `ఆజాదీ కా గౌరవ్` యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వైరా నియోజకవర్గంలో ఆయన యాత్ర జరుగుతుండగా.. చింతమనేని అక్కడ ప్రత్యక్షం అయ్యారు.

ఏపీలోని టీడీపీకి చెందిన నేత సడెన్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా భట్టితో కలసి కాసేపు నడిచారు. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తర్వాత.. నడుస్తూనే ముచ్చట్లు పెట్టారు. కాసేపు భట్టితో మాట్లాడిన తర్వాత యాత్రకు తన సంఘీభావం తెలియజేసి చింతమనేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. త్వరలో మునుగోడులో ఉపఎన్నిక రానున్న సందర్భంగా వీరి కలయికపై చర్చ జరుగుతుంది.

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సొంత పనుల కోసం ఖమ్మం జిల్లాకు వచ్చినట్లు తెలిసింది. మార్గమధ్యంలో భట్టి కలవడంతోనే కారు ఆపి ఆయనతో కాసేపు నడిచారని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. మధిర నుంచి మూడు సార్లు వరుసగా గెలిచిన భట్టికి ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చింతమనేని అనుకోకుండా కలిసినట్లు తెలుస్తుంది. కాగా, ఇటీవల హైదరాబాద్ శివారులో జరిగిన కోడి పందాల వ్యవహారంలో చింతమనేనిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఎక్కువగా ఏపీలోనే గడుపుతున్నారు.

First Published:  12 Aug 2022 2:25 PM GMT
Next Story