Telugu Global
Telangana

మాధవ్‌ది నాలుగు గోడల మధ్య వ్యవహారం, బలత్కారం లేదు, ఫిర్యాదు లేదు - సజ్జల

అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లాలి గానీ.. ఊతకర్రల కోసం వెతుకులాట ఎందుకని ప్రశ్నించారు. పైగా బీజేపీ పెద్దలే చంద్రబాబు వెంట పడుతున్నట్టు మీడియాలో కవరింగ్ ఏమిటని ప్రశ్నించారు.

మాధవ్‌ది నాలుగు గోడల మధ్య వ్యవహారం, బలత్కారం లేదు, ఫిర్యాదు లేదు - సజ్జల
X

ఢిల్లీలో నరేంద్రమోడీ, చంద్రబాబు ముచ్చట్లపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వెంటిలేటర్‌ మీద ఉందన్నారు. అధికారంలోకి వస్తామంటూ ఇంకా టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు ప్రజలు కూడా నమ్మే స్థాయిలో టీడీపీ ప్రచారం ఉందన్నారు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ మాట్లాడారన్నారు. చంద్రబాబు సొంతంగా ప్రజల వద్దకు వెళ్లి తీర్పు అడిగే పరిస్థితి లేదు కాబట్టి.. ఎన్నికలకు అవసరమైన రంగాన్ని కూడా చంద్రబాబు సిద్ధం చేసుకుంటున్నారని పరోక్షంగా మోడీతో చంద్రబాబు భేటీని సజ్జల ప్రస్తావించారు.

ఢిల్లీలో చంద్రబాబుకు అంత ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందా అని తాము ఆలోచిస్తుంటే.. మోడీతో భేటీ వల్ల అది వచ్చిందా అన్న భావన కలుగుతోందన్నారు. టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పడం గానీ, వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం గానీ, అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లాలి గానీ.. ఊతకర్రల కోసం వెతుకులాట ఎందుకని ప్రశ్నించారు. పైగా బీజేపీ పెద్దలే చంద్రబాబు వెంట పడుతున్నట్టు మీడియాలో కవరింగ్ ఏమిటని ప్రశ్నించారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో టీడీపీ ఉపయోగపడేలా.. ఏపీ వరకు టీడీపీకి బీజేపీ మద్దతుగా ఉండాలన్న ఒప్పందం చేసుకుంటున్నట్టుగా ఉందన్నారు. టీడీపీ ప్రతిపాదనకు మోడీ కూడా భలే ఉందని అనుకున్నారేమో అని సజ్జల వ్యాఖ్యానించారు. 2018లో తెలంగాణలో చంద్రబాబు మద్దతు తీసుకున్న కాంగ్రెస్ ఏమైందో ఒకసారి బీజేపీ వారు ఆలోచన చేసుకోవాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఆలోచన దత్తపుత్రుడు మొదలుపెట్టారని.. ఇప్పుడు ఢిల్లీలో మోడీని చంద్రబాబు కలిసే వరకు వచ్చిందన్నారు. మునుముందు ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలన్నారు.

మాధవ్ సంగతి కాదు.. ముందు ఓటుకు నోటు సంగతేంటి?

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. వీడియో నిజమా.. కాదా.. అన్నది తేలాల్సిన అవసరం ఉందని, అంత వరకు ఎదురుచూడాలన్నారు. టీడీపీ నేతలు ఆ వీడియో ఒరిజినలా.. కాదా అన్నది అరగంటలో తేల్చవచ్చని మాట్లాడుతున్నారని.. అలా అయితే చంద్రబాబు ఓటుకు నోటు ఆడియో నిజమా.. కాదా అన్నది ఏడేళ్లు అవుతున్నా ఎందుకు తేలడం లేదని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్‌ది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారమని, అవతలి మహిళ ఎవరో కూడా ఇప్పటికీ తెలియదని, పైగా మాధవ్‌పై ఎవరూ ఫిర్యాదు కూడా ఇవ్వలేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఇందులో బలత్కారం కూడా లేదన్నారు. అయినప్పటికీ ఎంపీగా ఉన్నారు కాబట్టి బాధ్యతగా ఉండాలి కాబట్టి ఆ వీడియో నిజమైనదే అని తేలితే మాధవ్ పై చర్యలు తీసుకుంటామని.. కానీ అది తేలడానికి సమయం పడుతుందన్నారు. అంత వరకు ఎదురుచూడాలన్నారు. ఓటుకు నోటు వ్యవహారం మాత్రం చాలా పెద్దది అని మీడియా ముందు దాన్ని ప్రశ్నించాలన్నారు.

First Published:  8 Aug 2022 2:10 PM GMT
Next Story