Telugu Global
Telangana

తెలంగాణతో ఏపీ తప్పులన్నీ చెప్పిస్తున్న బొత్స..

తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంత స్థాయి బొత్సకు లేదని ఘాటుగా బదులిచ్చారు సబిత. రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థపై చర్చించేందుకు సిద్దమా? అని సవాల్ విసిరారు.

తెలంగాణతో ఏపీ తప్పులన్నీ చెప్పిస్తున్న బొత్స..
X

రాజధాని లేని ఏపీ..

సరైన ఆస్పత్రులు లేని ఏపీ..

మంచి కంపెనీలు లేని ఏపీ..

ఇవన్నీ ఏపీలోని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కావు, తెలంగాణ మంత్రులు ఇచ్చిన కౌంటర్లు. విద్యావిధానంలో తెలంగాణను కదిలించి మరీ ఏపీని తిట్టిస్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా బొత్సకు ఘాటుగా బదులిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య పోలికేముందని అన్నారు.

తెలంగాణలో అంతా చూచిరాతలు, కుంభకోణాలంటూ.. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఆల్రడీ తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ బొత్సపై మండిపడ్డారు. ఆ తర్వాత తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా స్పందించారు. రెండు రాష్ట్రాల విద్యావిధానాలను ఆమె పోల్చి చెప్పారు. ఏపీ విద్యా విధానాన్ని తీవ్రంగా ఎండగట్టారు.

తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంత స్థాయి బొత్సకు లేదని ఘాటుగా బదులిచ్చారు సబిత. రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థపై చర్చించేందుకు మీరు సిద్దమా? అని సవాల్ విసిరారు. విద్యావ్యవస్థలో తాము చేసిందేమిటో, మీరు ఉద్ధరించిందేమిటో తేల్చుకునేందుకు చర్చిద్దామా? అని ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్ల నుంచి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఏపీ నాయకులు ఉన్నారని దుయ్యబట్టారు.

2015, 2018లో తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయని.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని బొత్సకు సబిత సూచించారు. ఐఐటీ, మెడికల్, ఇంజరింగ్‌ లో తెలంగాణ విద్యార్థులు సాధించిన ఫలితాలు మీకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. గురుకులాలతో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వివరించారు. ఏపీలో ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష మంది విద్యార్థులు ఎందుకు డ్రాపవుట్స్ గా మారారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో రెండున్నర లక్షల మంది విద్యార్థులు పెరిగారని తెలిపారు. ఏపీలో విద్యా వ్యవస్థ అంత బాగుంటే.. తెలంగాణ ఎంసెట్ కోసం ఏపీ విద్యార్థులు ఎందుకంత ఆసక్తి చూపిస్తారని ఇక్కడి కాలేజీల్లో చదవడానికి ఎందుకంత ఉత్సాహం చూపిస్తారని సూటిగా ప్రశ్నించారు.

మొత్తమ్మీద మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీకే తిరిగి రివర్స్ లో తగిలాయి. తెలంగాణ విద్యావ్యవస్థ ఎంత మెరుగ్గా ఉందనే విషయం మరోసారి తెలిసొచ్చింది. ఏపీలో మేడిపండులా ఉన్న విద్యావ్యవస్థ లొసుగుల్ని మరోసారి మంత్రి బయటపెట్టించినట్టయింది.

First Published:  14 July 2023 2:34 AM GMT
Next Story