Telugu Global
Telangana

రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ కాంగ్రెస్ నేత

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆ పార్టీ సీనియర్లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మావోయిస్టులపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై చర్యల కోసం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు.

రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ కాంగ్రెస్ నేత
X

ప్రగతి భవన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇంటాబయట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా ములుగులో నిన్న వ్యాఖ్యానించారు. అద్దాల మేడల తరహాలో కలెక్టరేట్లు ఎవరి కోసం అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రభుత్వానికి చెందిన ప్రగతి భవన్‌ను పేల్చాయాలని నక్సలైట్లను తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రోత్సహించడంతో కాంగ్రెస్ కూడా ఇరుకునపడింది.

వెంటనే పోలీసులు రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్‌ మోపాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి విజ్జప్తి చేశారు. గాంధీ సిద్ధాంతాలతో నడిచే పార్టీ అని చెప్పుకుంటూ ఇలా ప్రభుత్వ భవనాలను పేల్చాలని ఎలా పిలుపునిస్తారని ప్రశ్నించారు. ఛ‌త్తీస్‌గ‌డ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. మరి అక్కడి ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌పైనా బాంబులు వేయాల్సిందిగా రేవంత్ రెడ్డి పిలుపునిస్తారా అని నిలదీశారు. ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఒక సంఘ విద్రోహశక్తిలా మారుతున్నారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఆ పార్టీ సీనియర్లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మావోయిస్టులపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై చర్యల కోసం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు.

అటు కేఏ పాల్‌ కూడా రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రగతి భవన్‌ పేల్చేయాలన్న రేవంత్‌పై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి భూకబ్జాలు చేసి ఈ స్థాయికి వచ్చారని పాల్ విమర్శించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎప్పటికీ సమర్ధించబోదన్నారు. ఈ విషయంలో రేవంత్‌ను తమ పార్టీ వెనుకేసుకురాదన్నారు.

First Published:  8 Feb 2023 9:39 AM GMT
Next Story