Telugu Global
Telangana

కవితపై ట్రోలింగ్ కి బీజేపీ సపోర్ట్.. ట్విట్టర్లో తోకముడిచిన విష్ణు

ట్రోలింగ్ చేసే వారికి విష్ణు మద్దతు తెలపడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్.. విష్ణు ట్వీట్ కి ఘాటుగా రిప్లై ఇచ్చారు.

కవితపై ట్రోలింగ్ కి బీజేపీ సపోర్ట్.. ట్విట్టర్లో తోకముడిచిన విష్ణు
X

రాజకీయ నాయకులు, సినీ నటులని దారుణంగా ట్రోల్ చేస్తూ మార్ఫింగ్ ఫొటోలతో కించపరుస్తున్న 8మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి చేసిన ట్వీట్ దుమారం రేపింది. కవితను టార్గెట్ చేస్తూ విష్ణు ట్వీట్ వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్కామ్ లకు పాల్పడవచ్చు కానీ, సోషల్ మీడియాలో వారిపై ఎవరూ గొంతెత్తకూడదా అని ప్రశ్నించారాయన. దీంతో గొడవ మొదలైంది. ట్రోలింగ్ చేసే వారికి విష్ణు మద్దతు తెలపడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్.. విష్ణు ట్వీట్ కి ఘాటుగా రిప్లై ఇచ్చారు. బీఆర్ఎస్ అభిమానులు కూడా ట్విట్టర్లో ఓ రేంజ్ లో మండిపడ్డారు.


తోకముడిచిన విష్ణు..

ట్రోలింగ్ చేసినవారికి విష్ణు ఎందుకు సపోర్ట్ ఇచ్చారనేదే ఇక్కడ అసలు ప్రశ్న. కనీసం తెలంగాణ బీజేపీ నేతలు కూడా స్పందించక ముందే ఎక్కడో ఏపీలో ఉన్న బీజేపీ నేత వెటకారంగా ట్వీట్ చేయడం ఆలోచించాల్సిన విషయమే. అరెస్ట్ అయిన వారిలో ఏపీవారు కూడా ఉన్నారు. కృష్ణా, కడప, అనంతపురంతో సంబంధం ఉన్నవారు కూడా ట్రోలింగ్ విషయంలో పోలీసులకు చిక్కారు. వారి వెనక విష్ణు హస్తం ఉందా.. అందుకే ఇలా వారికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ వేశారా అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో విష్ణువర్దన్ రెడ్డి వెనక్కు తగ్గారు. బీఆర్ఎస్ నుంచి ఊహించని రీతిలో కౌంటర్లు మొదల్యయే సరికి విష్ణు తోకముడిచారు. తన ట్వీట్ డిలీట్ చేశారు.


కవరింగ్ కష్టాలు..

తనకు సరైన అవగాహన లేక వేసిన ట్వీట్ ను డిలీట్ చేశానంటున్న విష్ణు, మార్ఫింగ్ ఫొటోలతో మహిళలను కించపరిచేవారిని తానెప్పుడూ సపోర్ట్ చేయనని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించే అవకాశం ఉందని మాత్రమే తాను చెప్పదలుచుకున్నానని మరో ట్వీట్ వేశారు. తప్పుచేసి దొరికిపోవడంతో ఆయన వెనక్కి తగ్గినట్టయింది.

గురివింద నీతులు..

గతంలో విష్ణువర్దన్ రెడ్డి కూడా ఫేక్ ట్వీట్ల బాధితుడే. విష్ణు లీక్స్ పేరుతో ఎవరో తన పరువు తీస్తున్నారని, ఫేక్ ట్వీట్లతో తన ఇమేజ్ డ్యామేజీ చేస్తున్నారంటూ అప్పటి హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు విష్ణువర్దన్ రెడ్డి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేశారు. మరి తన విషయంలో జరిగిన తప్పు, ఇతరుల విషయంలో ఒప్పుగా ఎలా మారిందో విష్ణువర్దన్ రెడ్డి చెప్పాలి. తనపై ఫేక్ ట్వీట్లు వేస్తే పరువు నష్టం, మహిళ అయిన ఎమ్మెల్సీ కవితను మార్ఫింగ్ ఫొటోలతో విమర్శిస్తే మాత్రం వారిని అరెస్ట్ చేయకూడదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ గురివింద నీతులు ఇంకెన్నాళ్లు అంటున్నారు.



మార్ఫింగ్ ఫొటోలతో ట్రోలింగ్ చేస్తున్నవారిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో కలుగులోని ఎలుకలన్నీ ఒక్కొక్కటే బయటకొస్తున్నాయి. ఈ విషయంలో మొట్టమొదటిగా స్పందించిన బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. ట్వీట్ డిలీట్ చేసుకుని సైలెంట్ అయ్యారు.

First Published:  29 March 2023 6:02 PM GMT
Next Story