Telugu Global
Telangana

విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ఆ రెండు యూనివర్శిటీలు ఏపీలో కూడా

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలను ఏపీలో కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకి సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

విద్యార్థులకు శుభవార్త.. ఇకపై ఆ రెండు యూనివర్శిటీలు ఏపీలో కూడా
X

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వ్యవహారాల కోసం ఇకపై ఏపీ విద్యార్థులు హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన పనిలేదు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీకోసం కూడా ఇకపై పక్క రాష్ట్రం పోనవసరం లేదు. ఈ రెండు యూనివర్శిటీలకు ఏపీలో కూడా ప్రధాన కార్యాలయం, అనుబంధ కార్యాలయాల ఏర్పాటుకి రంగం సిద్ధమవుతోంది. కాస్త ఆలస్యంగా అయినా ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపడం విశేషం. ఈ రెండు యూనివర్శిటీలను ఏపీలో కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకి సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

చైర్మన్, సభ్యులు ఎవరెవరంటే..?

రాష్ట్ర రిజిస్ట్రేషన్లు స్టాంపు డ్యూటీల శాఖ డైరెక్టర్ వి.రామకృష్ణ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఉన్నత విద్యా మండలి జాయింట్ డైరెక్టర్ టీవీ కృష్ణమూర్తి మెంబర్ కన్వీనర్. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ ఓఎస్డీ వి.నిరీక్షణ బాబు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఓఎస్డీ డాక్టర్ వెలగా జోషి, ఉన్నత విద్యా మండలి డిప్యూటీ సెక్రటరీ.. ఈ కమిటీలో సభ్యులు. వీలైనంత త్వరగా ఈ కమిటీ తమ నివేదిక సమర్పిస్తుంది.

రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లవుతున్నా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీల విషయంలో ఇప్పటి వరకూ విభజన జరగలేదు. ఈ రెండు యూనివర్శిటీల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఉద్యోగుల విభజన, ఆస్తుల విభజన జరగలేదు, అడ్మిషన్ల విషయంలో క్లారిటీ లేదు. పక్క రాష్ట్ర యూనివర్శిటీల్లో చదువుకున్నట్టే ఏపీ విద్యార్థులకు ఆ రెండు యూనివర్శిటీలలో చదువుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ కష్టాలు తీరబోతున్నాయి.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోనే ఉన్నా.. ఏపీలో 76 అధ్యయన కేంద్రాలున్నాయి. వీటిలో 26 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 456 మంది పార్ట్ టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 13 మంది పెన్షనర్లు ఉన్నారు. ఈ 76 కేంద్రాలకు సంబంధించి 30వేలమంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు చదువుతున్నారు. 11 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం, జీపీఎఫ్ ద్వారా రూ.36 లక్షలు.. హైదరాబాద్ కేంద్రానికి వెళ్తోంది. కానీ అవి ఏపీకి బదిలీ కావడంలేదు. దీంతో ఇక్కడి ఉద్యోగుల జీతభత్యాలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీకి సంబంధించి కూడా ఏపీలో కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే కమిటీ వేసింది.

First Published:  7 May 2023 5:44 AM GMT
Next Story