Telugu Global
Telangana

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు.. రేసులో అందెశ్రీ, కోదండరాం

ప్రస్తుతం మండలిలో ఆరు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు.. రేసులో అందెశ్రీ, కోదండరాం
X

గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ సీనియర్లతో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరినవారు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, కవి అందెశ్రీ, అద్దంకి దయాకర్, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, టీజేఎస్ అధినేత, ప్రొఫెస‌ర్‌ కోదండరాం, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ రెండు ఖాళీల భర్తీ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది.

ఎన్నికల ముందు సీపీఐకి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి.. మరో ఎమ్మెల్సీ తర్వాత ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధిష్టానంతో చర్చించిన తర్వాతే అభ్యర్థులను ఫైనల్ చేస్తారని సమాచారం.

ఎన్నికలకు ముందు రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం బీఆర్ఎస్‌ పంపిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు స్థానాల కోసం పొలిటికల్ లీడర్ల పేరును పంపితే గవర్నర్‌ తిరస్కరించే అవకాశముందని కాంగ్రెస్‌ ఆలోచన చేస్తోంది.

ప్రస్తుతం మండలిలో ఆరు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్ కోటా, ఎమ్మెల్యేల కోటాలో రెండు చొప్పున ఎమ్మెల్సీలు ఖాళీగా ఉండగా.. గ్రాడ్యూయేట్స్‌, స్థానిక సంస్థల కోటాలో ఒక్కొ ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది. గవర్నర్‌ కోటాలో రెండు స్థానాలు కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానం గెలిచే బలం కూడా కాంగ్రెస్‌కు ఉంది. ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ సైతం ఒక ఎమ్మెల్సీ సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థల కోటాలోనూ గులాబీ పార్టీకి ఓ ఎమ్మెల్సీ దక్కే ఛాన్సెస్‌ ఉన్నాయి.

First Published:  26 Dec 2023 5:52 AM GMT
Next Story