Telugu Global
Telangana

కాలుష్యం నుంచి స్వచ్ఛ‌త వైపు.. హైదరాబాద్ మరో ముందడుగు..

గాలి నాణ్యతను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ద్వారా నిర్ధారిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగున్న నగరాల్లో భారత్ లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది.

కాలుష్యం నుంచి స్వచ్ఛ‌త వైపు.. హైదరాబాద్ మరో ముందడుగు..
X

దేశంలోని నగరాల్లో వాతావరణ కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాతోపాటు వాహనాల సంఖ్య పెరగడం, కర్బన ఉద్గారాల పరిమాణాలు భారీగా పెరగడం, నిర్మాణ రంగం నుంచి వెలువడే కాలుష్యం.. ఇతర కారణాలతో మెట్రోపాలిటన్ నగరాలు కాలుష్య కాసారాల్లా మారిపోతున్నాయి. దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కొన్నిచోట్ల సత్ఫలితాలనిస్తున్నాయి. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో అలా ముందడుగు వేస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలకంటే హైదరాబాద్ స్థితి చాలా మెరుగ్గా ఉంది. సవరించిన లక్ష్యాలను అందుకోవడంలోనూ హైదరాబాద్ దూసుకుపోతోంది.

గాలి నాణ్యతను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ద్వారా నిర్ధారిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏ నగరంలో ఎన్ని రోజులు బాగుంటుందో లెక్కగట్టి వాటికి మంచి రేటింగ్స్ ఇస్తారు. ఇలాంటి రేటింగ్స్ సాధించిన నగరాల్లో భారత్ లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. 2019లో హైదరాబాద్ లో AQI బాగా ఉన్న రోజులు 76. 2021లో వీటి సంఖ్య 109కి పెరిగింది. అంటే గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న రోజుల సంఖ్య పెరిగిందనమాట. మిగతా నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ మెరుగైన స్థానంలో ఉంది.

ఢిల్లీలో AQI బాగున్న రోజులు ఏడాదిలో కేవలం ఒకే ఒకటి. ముంబైలో 37 రోజులు, చెన్నైలో 79రోజులు, కోల్ కతాలో 89 రోజులపాటు AQI మెరుగ్గా ఉంది. హైదరాబాద్ లో ఏకంగా 109 రోజులు AQI మెరుగ్గా ఉండటం విశేషం. AQI శాతం 50కంటే తక్కువగా ఉండే రోజుల్ని మంచి వాతావరణం ఉన్న రోజులుగా లెక్కిస్తారు. AQI శాతం 100కంటే ఎక్కువగా ఉంటే అత్యంత విషపూరితమైన రోజులుగా వాటిని పరిగణిస్తారు. ఆయా రోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో వాతావరణ ప్రభావానికి ఎక్కువగా అస్వస్థతకు గురవుతారని అంచనా.

హైదరాబాద్ పరిస్థితి మెరుగ్గా ఉండటానికి కారణం ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ముఖ్యంగా మెట్రో రైలు ప్రయాణాలు మొదలైన తర్వాత కాలుష్యం కాస్త తగ్గింది. ట్రాఫిక్ జంఝాటాలు కూడా స్వల్పంగా తగ్గాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హరితవనాల నిర్వహణ పెరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం, నగర వనాలను ఏర్పాటు చేయడంతో పచ్చదనం పెరిగింది, కాలుష్య ప్రభావం తగ్గింది. సైకిల్ కారిడార్ లు ఏర్పాటు చేయడం, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టడం కూడా కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి.

అయితే సాధించిన విజయాలతోపాటు, సాధించాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సవరించిన లక్ష్యాలను అందుకోవ‌డానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. వివిధ మెట్రో నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ కంఫర్ట్ జోన్ లో ఉన్నా కూడా.. నగరంలో పెరుగుతున్న నిర్మాణ కార్యకలాపాల వల్ల కాలుష్యం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ట్రాఫిక్ సమస్యను మరింత తగ్గించగలిగితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

First Published:  28 Sep 2022 5:42 AM GMT
Next Story