Telugu Global
Telangana

యూపీలో గెలిచినంత ఈజీనా.. తెలంగాణ బాధ్యతను భుజానికెత్తుకున్న అమిత్ షా!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టిన అమిత్ షా.. ఎన్నికలు ముగిసే వరకు బెంగళూరులోనే ఉండే అవకాశం ఉన్నది.

యూపీలో గెలిచినంత ఈజీనా.. తెలంగాణ బాధ్యతను భుజానికెత్తుకున్న అమిత్ షా!
X

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను పార్టీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో తెలంగాణపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర నాయకులను ఢిల్లీకి పిలిపించి కీలక భేటీ నిర్వహించారు. గెలుపు కోసం తీసుకోవలసిన చర్యలను, అనుసరించాల్సిన వ్యూహాన్ని, అభ్యర్థుల ఎంపిక ఎలా చేయాలనే విషయాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టిన అమిత్ షా.. ఎన్నికలు ముగిసే వరకు బెంగళూరులోనే ఉండే అవకాశం ఉన్నది. నెలన్నర రోజులు ఆయన కర్ణాటకలో ఉండి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. ఆ తర్వాత ఆయన తెలంగాణపై దృష్టి పెడతారని తెలుస్తున్నది. గతంలో యూపీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అమిత్ షా కృషి ఉన్నది. ఆయన వ్యూహాల కారణంగానే అక్కడ బీజేపీ గెలిచిందనేది బహిరంగ రహస్యమే. అయితే తెలంగాణలో ఆయన వ్యూహాలు పని చేస్తాయా అనేది అనుమానమే.

యూపీలో మత రాజకీయాలు, ఆయోధ్య రామమందిర నిర్మాణం, డబుల్ ఇంజన్ సర్కారు అంటూ జిమ్మిక్కులు చేసి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. అయితే యూపీలో పని చేసే మత రాజకీయాలు తెలంగాణలో పని చేయడం కష్టమే. రాష్ట్ర నాయకులు కూడా ప్రతీ విషయంలో మతానికి సంబంధించిన కోణాలనే వెతుకుతున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లవ్ జీహాద్ అని.. హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారుస్తామని అంటారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తామో ఏనాడూ చెప్పరు.

ఇప్పటికే రాష్ట్రానికి రావల్సిన పలు ప్రాజెక్టులను రాకుండా కేంద్రమే అడ్డుకుంటోంది. హైదరాబాద్‌కు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఏకంగా గుజరాత్ తరలించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కోరే నిధులను కూడా ఇవ్వకుండా, అప్పులకు మోకాలడ్డుతూ ఇబ్బందులు పెడుతోంది. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఇటీవల 119 నియోజకవర్గాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరిగితే.. ప్రజల నుంచి స్పందన కరువయ్యింది. దీనిపై అమిత్ షా సీనియస్ కూడా అయ్యారు.

ఇక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులు దొరకడం బీజేపీకి కష్టంగా మారింది. బీజేపీ తరపున పోటీ చేసి గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను వెతకడం ఇప్పుడో పెద్ద టాస్క్. అమిత్ షా ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసినా.. అసలు అభ్యర్థులే కరువైతే ఎలా గెలిచేదని పార్టీలోనే చర్చ జరుగుతున్నది. ఉత్తరాదిన చేసినట్లు మతరాజకీయాలు దక్షిణాదిలో కష్టమని.. తెలంగాణ కోసం ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేయడమే కాకుండా.. బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టాలని అంటున్నారు. యూపీలో గెలిచినంత ఈజీగా తెలంగాణలో గెలుపు సాధ్యం కాదని కూడా భావిస్తున్నారు. బలమైన బీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే.. అంతకంటే బలమైన అభ్యర్థులు ఉండాలని వ్యాఖ్యానిస్తున్నారు. మరి అమిత్ షా ఈ ఇబ్బందులన్నింటికీ ఎలాంటి పరిష్కారం చూపుతారో అని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

First Published:  5 March 2023 7:51 AM GMT
Next Story