Telugu Global
Telangana

అసెంబ్లీ బరిలో కీలక నేతలు..! క్లారిటీ ఇవ్వని అమిత్ షా

కీలక నేతలు అసెంబ్లీ పోటీకి దూరంగా ఉండి, లోక్ సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యనేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై జాతీయస్థాయిలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని అమిత్‌ షా అన్నారు.

అసెంబ్లీ బరిలో కీలక నేతలు..! క్లారిటీ ఇవ్వని అమిత్ షా
X

తెలంగాణలో బీజేపీ కీలక నేతలు ఎంపీలుగా ఉన్నారు. కేంద్ర మంత్రి, ప్రస్తుత టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా మరికొందరు నేతలు ఎంపీలుగానే ఉన్నారు. వీరంతా అసెంబ్లీ బరిలో నిలిస్తే ఎన్నికల్లో బీజేపీకి మరింత ఊపు వస్తుందనే ప్రచారం ఉంది. అందులోనూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలపై పోటీకి దిగితే బీఆర్ఎస్ పై మరింత ఒత్తిడి పెంచినట్టవుతుందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేవీ నిజం కాకపోవచ్చు. ఎందుకంటే.. తాజా పర్యటనలో కూడా అమిత్ షా ఈ పోటీ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

ఎవరెవరు అసెంబ్లీకి..?

తెలంగాణలో బీజేపీ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉంది అనే విషయం అసెంబ్లీ ఎన్నికలతోనే తేలిపోతుంది. ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహకు మించిన సీట్లతో ఓ దశలో బీజేపీ బలం పెరిగిందని అనుకున్నారంతా. కానీ మునుగోడు ఫలితాల తర్వాత కమలం డీలా పడింది. ఇప్పుడు రెండో స్థానానికి కూడా పోటీపడలేని స్థితికి చేరుకుంది. ఈ దశలో అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలా, లేక లోక్ సభ పోరులో సత్తా చూపాలా అనే డైలమాలో పడింది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ విషయంలో అంత సీన్ లేదని ఈపాటికే క్లారిటీ వచ్చింది. అందుకే కీలక నేతలు అసెంబ్లీ పోటీకి దూరంగా ఉండి, లోక్ సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికే ఆసక్తి చూపిస్తున్నారు. కిషన్ రెడ్డి కూడా ఎంపీ అయితే కేంద్ర పదవి వస్తుందనుకుంటారు కానీ, ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ఇద్దరు ముగ్గురికి గ్రూప్ లీడర్ అనిపించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ దశలో అసలు బీజేపీకి ఎమ్మెల్యే అభ్యర్థులే దొరకడంలేదు.

అప్లికేషన్లంతా మాయ..

కాంగ్రెస్ లాగా బీజేపీ కూడా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నా.. అదంతా డూప్ షాట్ అని తేలిపోయింది. కార్యకర్తలే నేతల తరపున ఒకటికి రెండు స్థానాలనుంచి అప్లికేషన్లు పెట్టారు. అసెంబ్లీ స్థాయిలేని చాలామంది పార్టీ పరువు కాపాడ్డం కోసం అప్లికేషన్ల సంఖ్యను పెంచారు. హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా కూడా కేవలం 20నుంచి 25 సీట్ల విషయంలోనే క్లారిటీ ఉందని చెప్పడం గమనార్హం. మిగతా సీట్లకు అభ్యర్థుల్ని ఎంపిక చేసే విషయంలో స్క్రీనింగ్ కమిటీ జాగ్రత్తగా వ్యవహరించాలని నాయకులకు దిశా నిర్దేశం చశారు. ముఖ్యనేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశం ప్రస్తావనకు వచ్చినా.. దీనిపై జాతీయస్థాయిలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని అమిత్‌ షా అన్నారు. ఎన్నికల వేళ చేరికలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బీజేపీ డీలాపడింది. బీఆర్ఎస్ అసంతృప్తులు ఒకరిద్దరు ఉన్నా, వారు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. కీలక నేతలు అసెంబ్లీ బరిలో లేకపోతే.. పోలింగ్ కి ముందే బీజేపీ అస్త్ర సన్యాసం చేసినట్టే లెక్క.

First Published:  18 Sep 2023 1:39 AM GMT
Next Story