Telugu Global
Telangana

పెంచిందీ, తుంచిందీ 'ఆయనే' !

మునుగోడులో బీజేపీని ఓడించడం ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఓడించగలగడం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అమిత్‌షా 2017 నుంచి చేయని ప్రయత్నం లేదు.

పెంచిందీ, తుంచిందీ ఆయనే !
X

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత అంతూ పొంతూ లేకుండా విశ్లేషణలు సాగుతున్నవి. అందులో ప్రధానమైనది బీజేపీ సాధించిన ఓట్లు. మొత్తం నియోజకవర్గాన్ని స్వాధీనం చేసుకొని, సమస్త యంత్రంగాన్ని మోహరించి చెమటోడ్చినా రావలసిన ఆధిక్యం రాకపోవడానికి గల కారణాలను టీఆర్ఎస్ వడపోస్తోంది. ఏ అధికార పార్టీ అయినా ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఆత్మవిమర్శ చేసుకోవలసిందే. ఒకవేళ ఆత్మవిమ‌ర్శ చేసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు కమ్ముకొని రావచ్చు. రెండు ల‌క్షల 41 వేల ఓటర్లలో, దాదాపు 2 లక్షల మంది ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులే. కానీ, వారంతా ఒక వైపునకు మొగ్గు చూపలేదు. కనుక కేవలం సంక్షేమ కార్యక్రమాలు గెలిపించగలవన్నది ఒక మిథ్య. అయితే ఈ పథకాలే లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

మునుగోడులో వాస్తవంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ జరగవలసి ఉన్నది. కానీ కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు వచ్చింది. వ్యక్తిగత ఇమేజ్, ధనబలం వల్ల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్ తో తలపడగలిగారన్నది పాక్షిక సత్యమే! 12 వేల ఓట్ల నుంచి 87 వేల ఓట్ల దాకా బీజేపీ ఎగబాకగలిగిందంటే ఆలోచించవలసిన విషయం. అధ్యయనం చేయవలసిన అంశం. మేథోమథనం చేయవలసిన వ్యవహారం. దీన్ని సునాయాసంగా తీసుకోవడానికి వీల్లేదు. ఒక రాజకీయ ప్రత్యర్థిని నిర్వీర్యం చేసి మరో 'ప్రమాదకర' ప్రత్యర్థికి పరోక్షంగానైనా 'పాలు'పోయడంపై నిస్పక్షపాతంగా సమీక్షించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చతికిల బడడానికి, బీజేపీ పుంజుకోవడానికి 'పెద్ద సారే' కారణమని అధికారపార్టీ శాసనసభ్యులే అంటున్నారు. 'పెద్దసారు' ఏమి ఆశించి కాంగ్రెస్ ను దెబ్బతీసి ఉండవచ్చు? ఏమి ఆశించి బీజేపీ పుంజుకునేందుకు అవకాశాలు కల్పించి ఉండవచ్చు? ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, బయటకు వెళ్లే విధంగా నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా బీజేపీకి 'నీరు పోయడమే' కదా! ఈటల కాంగ్రెస్ కు కాకుండా బీజేపీకి వెడతారని 'పెద్దసారు'కు ముందే తెలుసు. హుజూరాబాద్ లో ఈటల బీజేపీ తరపున గెలుస్తారని పెద్దసారు అంచనా వేయకుండా ఎట్లా ఉంటారు!

'ఆయన'కు అన్నీ తెలుసు. పరిస్థితులను ముందుగానే అంచనా వేయడంలో, ప్రతికూల వాతావరణాన్ని కట్టడి చేయడంలో ఆయన దిట్ట. అయితే ఎంత గొప్ప వ్యూహకర్త అయినా ఒక్కోసారి అతను రచించే వ్యూహాలు బెడిసికొట్టవచ్చు. వికటించవచ్చు. కమ్యూనిస్టు పార్టీలను ఒకనాడు 'తోక పార్టీలు'గా తూలనాడిన పెద్దసారే, కామ్రేడ్లతో భుజంపై భుజం కలిపి నడవగలరు. కామ్రేడ్లు కూడా తమను తోకపార్టీలు అన్నారనో, సూది - దబ్బనం పార్టీలుగా కించపరిచారనో బెట్టు చేయలేదు. మొండికేయలేదు. 'పెద్దసారు' పిలవగానే ఆయనతో వాళ్ళు బేషరతుగా జతకట్టారు.ఈ విషయంలో ఉమ్మడిగా కలిసి వచ్చిన అంశం 'మతోన్మాద' శక్తులకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం. ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.' ఉన్మాద, విద్వేష రాజకీయాలు కావాలా..? అభివృద్ధి, సంక్షేమ రాజకీయాలు కావాలా'? అని ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా సంధించే ప్రశ్న సామాన్యమైనది కాదు. అది రాజకీయ కార్యకలాపాల్లో ఉన్న వారే కాకుండా, తెలంగాణ పౌరులందరికీ సూటిగా తాకుతుంది. వాళ్ళు ఎటు వైపు ఉండాలో తేల్చుకోక తప్పని అనివార్య పరిస్థితిలోకి కేసీఆర్ నెట్టివేశారు.

హిందుత్వ పార్టీ వల్ల జరిగే నష్టమమేమిటో, టీఆర్ఎస్ కొనసాగితే జరిగే ప్రయోజనమేమిటో క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకువెళ్లడంలో కేసీఆర్ ఇప్పటికే విజయం సాధించారు. కాగా లౌకిక వాద కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన తప్పిదాల నుంచి ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవలసి ఉన్నది. బీజేపీని నిలువరించడానికి సకల ప్రజాస్వామిక శక్తులు రాజకీయాలకతీతంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. అలా అని అందరూ కేసీఆర్ గొడుగు కిందకు రావలసిన పనేమీ లేదు. తమ ప్లాట్ ఫామ్ పైన ఉండే 'యుద్ధం' చేయవచ్చు. ఈ వ్యవహారంలో చాలా మంది రాజకీయ కార్యకర్తలకు ఉండే అనుమానం లేదా భయం ఏమిటంటే బీజేపీ వ్యతిరేక పోరాటంలో 'లాభమంతా' కేసీఆర్ ఖాతాలోకి వెళ్తుందని. ఇది తర్కానికి సంబంధించిన అంశమే, కాదనలేం. కానీ శత్రువు మీద మొదట కత్తి దూసిన వాడే విజేత. ఆ క్రెడిట్ కేసీఆర్ కే దక్కుతుంది. దేశంలో తమ జిత్తుల మారితనం, టక్కు టమార విద్యలతో అత్యంత బలశాలులుగా అవతరించిన మోదీ, అమిత్ షాలను ఢీ కొంటున్న రాజకీయ నాయకునిగా కేసీఆర్ జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని మనం మరచిపోరాదు.

మునుగోడులో బీజేపీని ఓడించడం ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఓడించగలగడం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అమిత్‌షా 2017 నుంచి చేయని ప్రయత్నం లేదు. చేయని కుట్రలు లేవు. వాటిని భగ్నం చేయడమే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎపిసోడ్. రెండేండ్లుగా ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకొని దాదాపు నెలకోసారి తెలంగాణలో షా పర్యటిస్తూ ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డికి 18,000 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి అకారణ ఉపఎన్నికను తీసుకు వచ్చిన అమిత్‌షాకు మునుగోడు ప్రజలు గట్టి గుణపాఠమే చెప్పారు. దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం, దాన్ని అమలు చేయడానికి మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి తదితర 'సేన' చేసిన నిర్విరామకృషి ఉన్నాయి.

మొత్తమ్మీద బీజేపీని మొగ్గలోనే తుంచివేయడానికి గాను కేసీఆర్ శ్రమ ఫలించిందని ప్రస్తుతానికి కొన్ని విశ్లేషణలు సాగుతున్నవి. అయితే ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని టీఆర్ఎస్ శ్రేణులు 'రిలాక్స్' అయితే అంతకంటే 'ఆత్మహత్యా సదృశ' సన్నివేశం మరొకటి ఉండదు.

First Published:  9 Nov 2022 4:30 AM GMT
Next Story