Telugu Global
Telangana

అంబులెన్స్ డ్రైవర్ అతి.. ఆస్పత్రిపై కేసు

పేషెంట్లకోసం వెళ్లి వచ్చే సమయాలు మినహా మిగతా సందర్భాల్లో అంబులెన్స్ కి అనవసరంగా సైరన్లు మోగించ వద్దని చెప్పారు డీజీపీ. అది నిబంధనలకు విరుద్ధం అని అన్నారు.

అంబులెన్స్ డ్రైవర్ అతి.. ఆస్పత్రిపై కేసు
X

అంబులెన్స్ సైరన్ వినపడితే చాలామంది పక్కకు జరిగి దారి ఇస్తారు. అంబులెన్స్ లో వెళ్లే పేషెంట్ కి అంతా మంచే జరగాలని కోరుకునే వారు కూడా ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ లు కూడా అంబులెన్స్ లు వస్తే మిగతా వాహనాలను ఆపి మరీ ట్రాఫిక్ క్లియర్ చేస్తారు, ఫస్ట్ ప్రయారిటీ అంబులెన్స్ లకే ఇస్తారు. అయితే ఆయా వాహనాల్లో పేషెంట్లు లేకపోయినా, ఇతర పనులమీద వాటిని బయటకు తీసుకొచ్చినా సైరన్ ఆపేయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ఉల్లంఘించినందుకు ఓ అంబులెన్స్ డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆ వ్యవహారాన్నంతా కెమెరాలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు ఆ ఆస్పత్రిపై కేసు నమోదైంది.


అసలేం జరిగింది..?

హైదరాబాద్ లో ఓ చౌరాస్తా వద్ద ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వహిస్తున్నారు. అంతలో సడన్ గా ఓ అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ వచ్చింది. లోపల పేషెంట్ ఉన్నారేమోననే ఉద్దేశంతో మిగతా ట్రాఫిక్ ని ఆపేసి ఆ అంబులెన్స్ కి దారిచ్చారు ట్రాఫిక్ పోలీస్. సీన్ కట్ చేస్తే ఆ చౌరాస్తా దాటిన తర్వాత అంబులెన్స్ స్పీడ్ తగ్గింది, దగ్గర్లోని ఓ మిర్చి బజ్జీ బండి వద్ద ఆ వాహనం ఆగింది. డ్రైవర్ కిందకు దిగి తాపీగా మిర్చి బజ్జీ పార్శిల్ కట్టించుకున్నాడు, ఓ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాడు. తీరా డ్రైవర్ అంబులెన్స్ ఎక్కబోయే సమయంలో ట్రాఫిక్ పోలీస్ అక్కడికి వచ్చారు. లోపల పేషెంట్ ఉన్నారా అని ఆరా తీశారు. లేరని తెలుసుకుని షాకయ్యారు. డ్రైవర్ తోపాటు ఆస్పత్రి స్టాఫ్ ఇద్దరున్నారు. పేషెంట్ లేకపోతే సైరన్ ఎందుకు మోగించావని డ్రైవర్ ని ప్రశ్నించారు ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇంకెప్పుడూ ఇలా చేయెద్దంటూ సీరియస్ అయ్యారు. ఆ తతంగాన్నంతా వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు.

ఆ వీడియోని డీజీపీ అంజనీ కుమార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పేషెంట్లకోసం వెళ్లి వచ్చే సమయాలు మినహా మిగతా సందర్భాల్లో అంబులెన్స్ కి అనవసరంగా సైరన్లు మోగించ వద్దని చెప్పారు డీజీపీ. అది నిబంధనలకు విరుద్ధం అని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల్ని హడావిడి పెట్టిన అంబులెన్స్ డ్రైవర్, డ్రైవర్ కి తగిన గైడెన్స్ ఇవ్వని ఆస్పత్రిపై కూడా పోలీసులు కేసు పెట్టారు.

First Published:  11 July 2023 4:14 PM GMT
Next Story