Telugu Global
Telangana

ఈటలే కాదు.. ఆయన కూడా జంప్.. బీజేపీకి షాక్ తప్పదా..!

చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మూడింట కాంగ్రెస్ విజయం సాధించింది. తాండూరు, వికారాబాద్, పరిగి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.

ఈటలే కాదు.. ఆయన కూడా జంప్.. బీజేపీకి షాక్ తప్పదా..!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇప్పుడు అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ గూటికి చేరతారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈటలతో పాటు మరో ప్రముఖ బీజేపీ నేత కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జోరందుకుంది.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారంటూ హస్తం పార్టీకి చెందిన సోషల్‌మీడియా గ్రూపుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈటలతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో చర్చలు మొదలయ్యాయని..త్వరలోనే ఈ ఇద్దరు కమలం పార్టీకి షాకిస్తారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల టికెట్ ఇచ్చేందుకు హస్తం పార్టీ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మూడింట కాంగ్రెస్ విజయం సాధించింది. తాండూరు, వికారాబాద్, పరిగి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం పార్టీ మార్పుపై పునరాలోచలన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి అయితే గట్టి పోటీ ఇవ్వగలిగినప్పటికీ.. గెలుపు అనుమానమే. కొండా కుటుంబానికి కాంగ్రెస్‌తో అనుబంధం ఉండడంతో.. ఆయన ఆ పార్టీ పట్ల పాజిటివ్‌గానే ఉన్నారు. కొద్దిరోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

2014లో బీఆర్ఎస్ తరపున చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. పార్టీ అగ్రనాయకత్వంతో విబేధాల కారణంగా 2018లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత 2021లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే కొండా పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ వార్తలను ఆయన ఖండించారు. మరీ తాజాగా జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించాల్సి ఉంది.

First Published:  28 Dec 2023 6:15 AM GMT
Next Story