Telugu Global
Telangana

ఆరు విడతల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు.. హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,43,544 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటి వరకు 65,538 మంది లబ్దిదారులకు ఇళ్లను కేటాయించామని ప్రభుత్వం చెప్పింది.

ఆరు విడతల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు.. హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
X

జీహెచ్ఎంసీ పరిధిలోని లబ్ధిదారులకు ఆరు విడతల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తాము. లబ్ధిదారులందరికీ ఈ మేరకు ఇళ్లు అందుతాయని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించడం లేదని బీజేపీ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి 2021లో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,43,544 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటి వరకు 65,538 మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించామని ప్రభుత్వం చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలో 65,458 ఇళ్లను లబ్ధిదారులకు దశల వారీగా కేటాయిస్తామని హైకోర్టుకు తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే తొలి విడతలో 4,074 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించామని పేర్కొన్నది. సెప్టెంబర్ మొదటి వారం నాటికి మరో 12,275 ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.

జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు తప్పకుండా కేటాయిస్తాము. నవంబర్ మొదటి నాటికి జీహెచ్ఎంసీ పరిధిలోని లబ్ధిదారులందరికీ ఇళ్లను కేటాయిస్తామని.. ఆరు విడతల్లో వీరికి అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. కాగా, దీనికి సంబంధించిన పురోగతి నివేదిక సమర్పించేందుకు మరి కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపున లాయర్ కోరారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందిన హైకోర్టు.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

First Published:  10 Aug 2023 12:02 PM GMT
Next Story