Telugu Global
Telangana

ఈ సారి మాకు ఎక్కువ సీట్లు కేటాయించండి.. కాంగ్రెస్‌పై ముస్లిం నాయకుల ఒత్తిడి!

గత 9 ఏళ్లలో కాంగ్రెస్ తరపున ఒక్క ముస్లిం నాయకుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. ఏఐఎంఐఎం నుంచి ఏడుగురు, బీఆర్ఎస్ నుంచి ఒకరు అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఈ సారి మాకు ఎక్కువ సీట్లు కేటాయించండి.. కాంగ్రెస్‌పై ముస్లిం నాయకుల ఒత్తిడి!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో కాంగ్రెస్ బిజీగా ఉన్నది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల కమిటీ.. ప్రాథమిక జాబితా ఖరారు చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపింది. నిన్నటి నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయ సేకరణ, సంప్రదింపులు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ముస్లిం నాయకులు రాష్ట్ర నాయకత్వం, అధిష్టానానికి సరికొత్త ప్రతిపాదన పెట్టారు. గతంలో కంటే ఇప్పుడు తమ వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించాలని పట్టుబడుతున్నారు.

గత 9 ఏళ్లలో కాంగ్రెస్ తరపున ఒక్క ముస్లిం నాయకుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. ఏఐఎంఐఎం నుంచి ఏడుగురు, బీఆర్ఎస్ నుంచి ఒకరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇందులో మెజార్టీ ఎమ్మెల్యేలు పాత నగరానికి చెందిన వారే కావడం గమనార్హం. అయితే హైదరాబాద్‌లోనే కాకుండా ముస్లిం మెజార్టీ ఓటర్లు ఉన్న సెగ్మెంట్లలో తమ వారికే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ముస్లిం నాయకులకు టికెట్లు కేటాయించింది. ఇందులో ఆరుగురు నగర పరిధిలోనే పోటీ చేయగా.. ఒకరు కామారెడ్డి, మరొకరు నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగారు. కానీ ఒక్కరు కూడా గెలవక పోవడం గమనార్హం.

కాంగ్రెస్ టికెట్ల కోసం ఈ సారి 50 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం పాత నగరం పరిధిలోనే కాకుండా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లిం నాయకులు కూడా ఇందులో ఉన్నారు. రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నది. వీరు ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలోనే ఉన్నారు. అదే వర్గానికి చెందిన నాయకులకు టికెట్లు ఇస్తే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తమకు ఈ సారి కనీసం 15 సీట్లు కావాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో 15 మంది ముస్లిం నాయకులకు టికెట్లు ఇచ్చారు. వీరిలో తొమ్మిది మంది ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణలో కూడా అదే పద్దతిలో ఎక్కువ టికెట్లు ముస్లిం వర్గాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ముస్లంల జనాభా 12 శాతం వరకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ టికెట్లు కేటాయిస్తే.. ముస్లిం ఓటర్లను మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రభావితం చేయవచ్చని సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్థిక, ఇతర విషయాల్లో మద్దతు ఇచ్చినట్లే.. ముస్లిం క్యాండిడేట్లకు కూడా ఇస్తే తప్పకుండా విజయం సాధిస్తారని అంటున్నారు.

ముస్లిం నాయకులకు టికెట్లు ఇవ్వడమే కాకుండా, ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆ వర్గాల ఓటర్లు, ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందని నాయకులు చెబుతున్నారు. 2018లో ముస్లింలు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు వెళ్లిపోయారని.. వారిని తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించాలంటే ఎక్కువ సీట్లు, ఆర్థిక సాయం వంటివి తప్పకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముస్లింలలో చరిష్మా, అనుచరగణం ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారని.. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నారు.

షబ్బీర్ అలీ (కామారెడ్డి), మహ్మద్ అజారుద్దీన్, ఆమీర్ జావీద్ (జూబ్లీహిల్స్), ఫిరోజ్ ఖాన్ (నాంపల్లి), సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ (వరంగల్ ఈస్ట్), తాహిర్ బిన్ హమ్‌దాన్ (నిజామాబాద్ అర్బన్), ఒబేదుల్లా కొత్వాల్ (మహబూబ్‌నగర్), సాజిద్ ఖాన్ (అదిలాబాద్), ఎండీ జావీద్ (ఖమ్మం) కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేశారు. వీరందరికీ స్థానికంగా బలమైన అనుచరగణం ఉన్నది. ఆయా నియోజకవర్గాల్లో 40 వేల నుంచి 60 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఒక్క కామారెడ్డి తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపోటములను నిర్ణయించగలరు. ఇలాంటి వారికి తప్పకుండా ఛాన్స్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు.

First Published:  5 Sep 2023 3:19 AM GMT
Next Story