Telugu Global
Telangana

ప్రాజెక్టుల ఆలస్యానికి కారణం కేంద్ర అధికారులే.... రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యాలయాల మధ్య అంతర్గత కుమ్ములాటల కారణంగానే అన్ని ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కుశ్వాహా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్-ఇన్-ఛీఫ్ జవాబు ఇచ్చారు.

ప్రాజెక్టుల ఆలస్యానికి కారణం కేంద్ర అధికారులే.... రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ
X

గత ఐదేళ్ళకాలంలో కేంద్రం తెలంగాణకు కేటాయించిన జాతీయ రహదారుల ప్రాజెక్టుల ఆలస్యానికి కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖకు చెందిన హైదరాబాద్ ప్రాంతీయ అధికారి ఎస్కే కుశ్వాహా కారణమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆరోపించింది. ఎస్కే కుశ్వాహా సహకరించని కారణంగా నిర్మాణాల పనులు నత్తనడకన సాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ పేర్కొంది.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యాలయాల మధ్య అంతర్గత కుమ్ములాటల కారణంగానే అన్ని ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కుశ్వాహా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్-ఇన్-ఛీఫ్ జవాబు ఇచ్చారు.

ప్రాంతీయ అధికారి ఎస్కే కుశ్వాహా వద్ద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వివరాలు

1. టెండర్లు పిలవవలసిన ఈ క్రింది 5 జాతీయ రహదారుల పనులు

*మెదక్ – ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి - రుద్రూరు, ఖమ్మం – కుర్వి

* ఆదిలాబాద్ – బేల

*గౌరెల్లి - వలిగొండ

2. నిజామాబాద్ - ఆర్మూర్ మధ్యలో మిగిలిన నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారి బ్యాలన్స్ పనుల ప్రతిపాదనలు

3. ఎన్.ఎస్.వి. సర్వే ప్రతిపాదనలు

4. నిజాంపేట్ – నారాయణ్ ఖేడ్ రోడ్డు భూసేకరణ డబ్బులు చెల్లింపులలో జాప్యం

5. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ యొక్క భూసేకరణ డబ్బులు చెల్లింపులలో జాప్యం

6. ఆరామఘర్-శంషాబాద్ ఆరు లేన్ల రహదారి భూసేకరణ డబ్బులు చెల్లింపులలో జాప్యం, ప్రాజెక్టు నిర్మాణ గడువుకాలం పొడగింపు ప్రతిపాదనలు

ఈ విషయంలో గత సంవత్సరం 2022 జూన్ నెలలో తెలంగాణలోని జాతీయ ప్రాజెక్టుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ఉన్నతాధికారులు ఆర్వో కార్యాలయంలో ఉన్న పెండింగ్ పనుల విషయమై ఎస్కే కుశ్వాహాను మందలించినట్లు తెలుస్తుంది.

దాంతో, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యాలయాల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయంటూ నిందారోపణలు చేస్తూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శికి ఆర్వో ఎస్కే కుశ్వాహా ఒక లేఖను రాశారు. ఈ కుమ్ములాటల వల్ల ప్రాజెక్టులు నత్తనడకన జరుగుతున్నాయని ఆ లేఖలో అవాస్తవ ఆరోపణలు చేశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ తెలిపింది.

రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్-ఇన్-ఛీఫ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, జాప్యానికి కారణం ఆర్వో కార్యాలయం పనితీరేనని వివరణ ఇచ్చారు.

1. ఆరామఘర్-శంషాబాద్ లోని ఎన్హెచ్- 44 ఆరు లేన్ల రహదారి, ఉప్పల్ ఎన్హెచ్-163లోని ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్లు రెండూ జాతీయ ప్రాజెక్టులు అయినా భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన ఏజెన్సీ ఛార్జెస్ నుంచి మినహాయించుకొని ఇవ్వడానికి 2021 సెప్టెంబరులో కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖ అంగీకరించగా, ఎస్కే కుశ్వాహా ఆ నిధులను ఇప్పటివరకు విడుదల చేయలేదు.

ఆరామర్-శంషాబాద్ లోని ఎన్ హెచ్- 44 ఆరు లేన్ల రహదారికి సగభాగం నిధులు ఇవ్వగా, మిగిలిన సగభాగం ఇప్పటి వరకు ఇవ్వక పోవడంతో 15 శాతం పనులు ఆగిపోయాయి.

2. ఎన్హెచ్-163పై నిర్మించతలపెట్టిన అంబర్పేట ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభంలో కొంత ఆలస్యమైనా, ప్రస్తుతం పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి.

3. ఎన్హెచ్-65లో ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకూ నిర్మించదల్చిన ఆరు లేన్ల రోడ్ల పనులు సజావుగా సాగుతున్నాయి.

4. ఎన్హెచ్-65లోని పుణే - హైదరాబాద్ మార్గంలో బీహెచ్ ఈ ఎల్ వద్ద నూతనంగా నిర్మించదల్చిన ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం సర్వీస్ రోడ్డు పనులు, ఇతర శాఖల యుటిలిటీ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు మరింత సులువుగా జరిగేందుకు డిజైన్ మార్చడం కోసం సంబంధిత అధికారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు, ఆదేశాలు రాగానే పనులు ఊపందుకుంటాయి.

తమ కార్యాలయంలో జరుగుతున్న జాప్యంతో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యాలయాల మధ్య అంతర్గత కుమ్ములాటలు అంటూ నిందారోపణ చేస్తూ ఎస్కే కుశ్వాహా లేఖను రాసారన్నది బహిర్గతమవుతోందని ఆర్ అండ్ బి శాఖ వివరణ ఇచ్చింది.

First Published:  4 April 2023 1:59 AM GMT
Next Story