Telugu Global
Telangana

వీళ్ల‌ ఆస్తుల లెక్క‌లు.. అంతా మాయ‌!

50 మందికిపైగా అభ్యర్థులు తమకు రూ.50 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు వాళ్ల అఫిడవిట్‌లో తెలిపారు. ఇది మార్కెట్ విలువ‌ ప్రకారమే. వాస్తవ ధరల ప్రకారం వారి ఆస్తుల విలువ ప్రకటించిన దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో అంచనా కూడా వేయలేం.

వీళ్ల‌ ఆస్తుల లెక్క‌లు.. అంతా మాయ‌!
X

600 కోట్లు, 460 కోట్లు, 450 కోట్లు ఇవి బాక్సాఫీస్ కలెక్షన్లు కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల ఆస్తులు. అవును ఒక్కొక్కరి ఆస్తి ఎంతో తెలుసుకుంటే మనం ముక్కున వేలేసుకోవాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది కోటీశ్వరులే. తమకు వందల కోట్ల ఆస్తులున్నాయని స్వయంగా అభ్యర్థులే వారి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పోటీ చేస్తున్న వాళ్లలో చాలా మంది కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ విద్యాసంస్థల ఓనర్లు, ఇతర బిజినెస్‌లు చేస్తున్న వాళ్లు ఉన్నారు. 50 మందికిపైగా అభ్యర్థులు తమకు రూ.50 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు వాళ్ల అఫిడవిట్‌లో తెలిపారు. ఇది మార్కెట్ విలువ‌ ప్రకారమే. వాస్తవ ధరల ప్రకారం వారి ఆస్తుల విలువ ప్రకటించిన దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో అంచనా కూడా వేయలేం.

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ల ఆస్తుల్ని పరిశీలిస్తే.. మొదటి మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఫోర్త్‌ ప్లేస్‌లో ఉన్నారు. చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వివేక్‌.. 606 కోట్ల రూపాయలతో అత్యంత సంపన్నుడిగా మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 461 కోట్ల రూపాయల ఆస్తులతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. 458 కోట్ల రూపాయల ఆస్తులతో మునుగోడు అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. 227 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నారు. 197 కోట్ల 40 లక్షల రూపాయలతో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఐదో స్థానంలో ఉన్నారు.

ఎన్నికల బరిలో ఉన్న మరికొందరు ప్రముఖుల ఆస్తులు పరిశీలిస్తే సీఎం కేసీఆర్‌కు 58 కోట్ల 93 లక్షల రూపాయల ఆస్తులున్నాయి. కేటీఆర్ ఆస్తి రూ.53 కోట్ల 31లక్షలు. ఈటల రాజేందర్ ఆస్తి 50 కోట్ల 93 లక్షల రూపాయలు. రేవంత్‌రెడ్డి ఆస్తి 30 కోట్ల 4 లక్షల రూపాయలుగా ఉంది. ప్రముఖ రాజకీయ నాయకుల్లో కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయే పేదవారని చెప్పాలి. తనకు ఎలాంటి స్థిరాస్థి లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్థుల విలువ 79 లక్షల రూపాయల వరుకు ఉంటుందని పేర్కొన్నారు. చాలామంది అభ్యర్థుల ఆస్తులు వాళ్ల భార్యల పేరు మీదే ఉన్నాయి.


First Published:  11 Nov 2023 4:33 PM GMT
Next Story