Telugu Global
Telangana

ఎస్జీటీ పోస్టులన్నీ డీఎడ్‌ అభ్యర్థులకే.. కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కారు

మున్ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్పును రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది.

ఎస్జీటీ పోస్టులన్నీ డీఎడ్‌ అభ్యర్థులకే.. కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కారు
X

సర్కారు బడుల్లోని సెకెండరీ గ్రేట్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులన్నీ డీఎడ్ చేసిన అభ్యర్థులకే ప్రభుత్వం కేటాయించనున్నది. ఎస్జీటీ ఉద్యోగాలకు బీఈడీ చేసిన వారు అర్హులు కాదని, కేవలం డీఎడ్ చదివిన వారే అర్హులని ఇటీవల రాజస్థాన్‌కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మున్ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. తెలంగాణ ప్రభుత్వం ఈ తీర్పును రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది.

ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చదవిని వారు కూడా అర్హులే అని 2018లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఎస్జీటీ కోసం రాసే పేపర్-1కు బీఈడీ అభ్యర్థులను కూడా విద్యా శాఖ అవకాశం ఇచ్చింది. దీంతో బీఈడీ వాళ్ల కోసమే కేటాయించిన టెట్-2తో పాటు చాలా మంది బీఈడీ అభ్యర్థులు టెట్-1కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడంతో బీఈడీ అభ్యర్థులు టెట్-1కు హాజరయ్యే వీలు లేకుండా పోయింది.

సుప్రీంకోర్టును అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఏ పోస్టుకు ఏ విద్యార్హత ఉండాలనే విషయంపై స్పష్టత ఇస్తూ ఇవ్వాలో రేపో విద్యా శాఖ జీవో జారీ చేయనున్నది. దీని ప్రకారం ఈ నెల రెండో వారంలో టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇక టీఆర్టీని ఈ సారి ఆన్‌లైన్ విధానంలో జరపనున్నారు. ఇందు కోసం ఇప్పటికే విద్యా శాఖ చర్యలు చేపట్టింది. టీఆర్టీని తొలిసారి కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తుండటంతో.. దాని బాధ్యతలను టీఎస్ ఆన్‌లైన్‌కు అప్పగించారు.

టీఆర్టీలో ఈ సారి 5,089 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 2017లో నిర్వహించిన టీఆర్టీలో 8,792 ఉద్యోగాలకు గాను.. 2.75 లక్షల మంది పోటీ పడ్డారు. అప్పట్లో ఉమ్మడి జిల్లాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేశారు. అయితే ఈ సారి కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో కొన్ని సబ్జెక్టుకు పోస్టులు ఉండే అవకాశం లేదు. దీనిపై నోటిఫికేషన్‌లో స్పష్టత వస్తుంది. దీని ప్రకారం ఈ సారి అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని విద్యా శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First Published:  6 Sep 2023 1:19 AM GMT
Next Story