Telugu Global
Telangana

తన ఐడెంటిటీ అంతా చెరిపేసి వెళ్లిపోయింది.. 5 ఏళ్ల తర్వాత ఆచూకీ కనిపెట్టిన తెలంగాణ పోలీస్

హైదరాబాద్‌లోని హుమాయూన్ నగర్‌కు చెందిన ఒక ధనవంతుల కుటుంబంలోని మహిళ (36) 2018 జూన్ 29న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లే సమయంలో ఇంట్లోనే తన ఫోన్ వదిలేసి వెళ్లింది.

తన ఐడెంటిటీ అంతా చెరిపేసి వెళ్లిపోయింది.. 5 ఏళ్ల తర్వాత ఆచూకీ కనిపెట్టిన తెలంగాణ పోలీస్
X

ఆ మహిళకు భర్తతో విభేదాలు ఉన్నాయి. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు వస్తుండటంతో అప్పుడప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయేది. ఒకటి రెండు రోజుల తర్వాత మళ్లీ ఇంటికి వచ్చేది. అలా ఐదేళ్ల క్రితం ఒక రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కానీ ఈ సారి మాత్రం తిరిగి రాలేదు. దీంతో సదరు మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏళ్లు గడుస్తున్నా ఆమె ఆచూకి మాత్రం తెలియరాలేదు. దీంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ మహిళ అదృశ్యం కేసులో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని హుమాయూన్ నగర్‌కు చెందిన ఒక ధనవంతుల కుటుంబంలోని మహిళ (36).. 2018 జూన్ 29న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లే సమయంలో ఇంట్లోనే తన ఫోన్ వదిలేసి వెళ్లింది. అంతే కాకుండా తన ఫోన్, వెబ్, ఇతర మాధ్యమాల్లో ఉన్న తన డిజిటల్ ఐడెంటిటీలు అన్నీ పూర్తిగా డిలీట్ చేసి వెళ్లిపోయింది. ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారణ లేట్ కావడంతో సదరు మహిళ తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో తెలంగాణ పోలీసులు ఆ కేసును ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. అడిషనల్ డీజీ శిఖా గోయల్ నేతృత్వంలో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

కాగా, ఇంట్లో నుంచి పారిపోయిన మహిళ దగ్గర రెండో ఫోన్ ఉన్నట్లు తన స్నేహితురాలి ద్వారా తెలిసింది. ఆ ఫోన్ ఉపయోగించే ఒక కార్ అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. ఆ కారులో మహారాష్ట్రలోని పూణేకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అయితే కోవిడ్ కారణంగా విచారణలో జాప్యం జరిగింది. ఇటీవల మళ్లీ తప్పిపోయిన మహిళలు, యువతులకు సంబంధించిన కేసులు పరిశీలిస్తుండగా.. హుమాయూన్ నగర్‌కు చెందిన మహిళ కేసు బయట పడింది. దీంతో ఆమెపై మరోసారి నిఘా పెట్టారు. అయితే, ఇటీవల సదరు మహిళ ఆధార్ అప్‌డేట్ అయినట్లు గుర్తించారు.

తన ఆధార్‌లో భాషను మరాఠీకి మార్చడమే కాకుండా.. తన మతం, భర్త పేరును మార్చినట్లు గుర్తించారు. దీంతో మార్చిన ఆధార్ సాయంతో ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్లు తెరిచిందా అని పోలీసులు లోతుగా విచారణ చేయగా.. గోవాలో అకౌంట్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి సదరు మహిళ ఆచూకీని కనుగొన్నారు.

హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత పూణేలోని ఒక స్వచ్ఛంధ సేవా సంస్థలో ఆమె పని చేస్తోంది. అంతే కాకుండా తన డిజిటల్ ఫుట్ ప్రింట్‌లు మొత్తం డిలీట్ చేసి.. కొత్త ఐడీలతో సోషల్ మీడియా అకౌంట్లు తెరిచినట్లు గుర్తించారు. తన భాష, వేషం మొత్తం మార్చేసుకున్న ఆ మహిళ మరో వ్యక్తిని పెళ్లి కూడా చేసుకున్నది. హైదరాబాద్ పోలీసులు వెళ్లి చెప్పే వరకు కొత్త భర్తకు తన భార్య గత చరిత్ర ఏమీ తెలియకపోవడం గమనార్హం. చివరకు పోలీసులు ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టారు. తాను ఇక్కడ ఉండనని.. తన జీవితం తాను బతుకుతానని కోర్టుకు చెప్పింది. మేజర్ కావడంతో ఆమె కోరిక ప్రకారమే కోర్టు జీవించవచ్చని తెలిపింది. మొత్తానికి ఐదేళ్లుగా ఎవరికీ కనిపించకుండా పోయిన మహిళను.. తెలంగాణ పోలీసులు అలా కనిపెట్టి తీసుకొని వచ్చారు.

First Published:  14 Sep 2023 4:05 AM GMT
Next Story