Telugu Global
Telangana

అలర్ట్: బాబాలమంటూ వస్తారు.. దీవిస్తూ మత్తు మందు చల్లి.. ఆపై..

కాషాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తాను శ్రీశైలం నుంచి వచ్చానని, బాబానంటూ ఇంట్లోకి వచ్చాడు. వరలక్ష్మితో మాట కలిపి ఆమెను దీవిస్తున్నట్లు నమ్మించి మత్తుమందు చల్లాడు.

అలర్ట్: బాబాలమంటూ వస్తారు.. దీవిస్తూ మత్తు మందు చల్లి.. ఆపై..
X

దొంగలు ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతుల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. రకరకాల వేషాల్లో వస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ దొంగ.. బాబా గెటప్ లో వచ్చి ఓ ఇల్లు గుల్ల చేశాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రప్రస్థ కాలనీలో వరలక్ష్మి, రాము దంపతులు నివసిస్తున్నారు. రాము వ్యాపారం చేస్తుంటాడు.

ఇదిలా ఉండగా శనివారం రాము ఇంట్లో లేని సమయంలో కాషాయ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తాను శ్రీశైలం నుంచి వచ్చానని, బాబానంటూ ఇంట్లోకి వచ్చాడు. వరలక్ష్మితో మాట కలిపి ఆమెను దీవిస్తున్నట్లు నమ్మించి మత్తుమందు చల్లాడు. దీంతో ఆమె మైకంలోకి వెళ్లగానే మెడలోని బంగారం గొలుసు లాక్కొని పారిపోయాడు.

ఆ తర్వాత దొంగ బాబా సమీపంలోని మరో రెండిళ్లలో ఇలాగే చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను ఇలాగే మభ్యపెట్టే ప్రయత్నంలో ఉండగా ఆమె భర్త ఇంటికి వచ్చాడు. దీంతో అతడు మెల్లగా అక్కడి నుంచి ఉడాయించాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. మత్తు వదిలిన తర్వాత వరలక్ష్మి బాబాగా వచ్చిన వ్యక్తి మెడలోని గొలుసు లాక్కెళ్లినట్లు గుర్తించింది.ఈ దొంగ బాబాపై కాలనీ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దొంగబాబా అరెస్టు

సీసీటీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు దొంగ బాబా కోసం గాలింపు చేపట్టారు. ఇవాళ అతడిని అరెస్టు చేశారు. కొద్దిసేపటి తర్వాత అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, బాబాల మంటూ ఎవరైనా ఇంటికి వస్తే నమ్మవద్దని తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

First Published:  29 Jan 2023 7:26 AM GMT
Next Story