Telugu Global
Telangana

సవాళ్లతో కూడిన ఎయిర్‌పోర్ట్ మెట్రో.. కొండపై నుంచి మెట్రో లైన్?

మెట్రో వెళ్లే మార్గంలో.. రాజేంద్రనగర్ వద్ద ఎత్తైన గుట్టలు, కొండ ఉన్నాయి. ఇక్కడ మెట్రోలైన్ దాదాపు 1.3 కిలోమీటర్లు కొండపై నుంచి వెళ్లాల్సి ఉంది.

సవాళ్లతో కూడిన ఎయిర్‌పోర్ట్ మెట్రో.. కొండపై నుంచి మెట్రో లైన్?
X

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎయిర్‌పోర్ట్ మెట్రోకు క్షేత్ర స్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ఏ రూట్లో మెట్రో లైన్ వెళ్తుందో.. ఇప్పటికే దానికి సంబంధించిన అలైన్‌మెంట్ మార్కింగ్ పనులు పూర్తయ్యాయి. విపరీతమైన రద్దీ ప్రాంతాలు, కొండలు గుట్టలతో కూడిన ఈ మార్గం చాలా సవాళ్లతో కూడుకున్నదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు. ఎయిర్‌పోర్ట్ మెట్రోకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలనను బుధవారం చేపట్టారు. మెట్రో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (రైల్వే) జైన్ గుప్తాతో కలిసి ఆయన తనిఖీ చేశారు.

మెట్రో వెళ్లే మార్గంలో.. రాజేంద్రనగర్ వద్ద ఎత్తైన గుట్టలు, కొండ ఉన్నాయి. ఇక్కడ మెట్రో లైన్ దాదాపు 1.3 కిలోమీటర్లు కొండపై నుంచి వెళ్లాల్సి ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఏ మెట్రో రైలు కూడా కొండలపై నుంచి వెళ్లలేదు. రాజేంద్రనగర్ ప్రాంతంలో కొండలు, బండరాళ్లు, లోయలతో కూడిన ప్రాంతంలో వయాడక్ట్‌ల నిర్మాణం కష్టంతో కూడుకున్నది. అయినా సరే ఇక్కడి క్లిష్టమైన మార్గంలో మెట్రో లైన్ నిర్మాణం ఎలా చేయాలనే విషయంపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

మెట్రో అలైన్‌మెంట్, ఓఆర్ఆర్ క్రాష్ బారియర్ల మధ్య కేవలం 18 అడుగుల దూరమే ఉంది. అక్కడ డీప్ కటింగ్ కూడా ఉంది. కాబట్టి అవుటర్‌పై బండ రాళ్లు పడకుండా తగిన బలం, ఎత్తుతో కూడిన రక్షణ బ్యారియర్లు నిర్మించాలని నిర్ణయించారు. మెట్రో వయాడక్ట్‌ను రక్షించడానికి ఎడమ వైపు ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆక్రమణలు నిరోధించడానికి హెచ్ఎండీఏతో కలిసి సరిహద్దు రాళ్లను పాతనున్నారు.

ఇక్కడి పెద్ద బండ రాళ్లను తొలగించకుండానే తక్కువ ఎత్తు ఉన్న స్తంభాలు, స్టబ్‌లతో మెట్రో వయాడక్ట్ నిర్మించనున్నారు. ఇందుకు సాధ్యమవుతుందో లేదో ముందుగా పరిశీలిన చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. కొండపై ఉన్న తాత్కాలిక రహదారిని పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఇక రాయదుర్గం నుంచి నానక్‌రామ్ గూడ జంక్షన్ వరకు కూడా ఇంజనీరింగ్ పరంగా క్లిష్టంగా ఉన్నది. ఇక్కడ సాంకేతిక సవాళ్లను ఎదుర్కోక తప్పదని ఎండీ వివరించారు. 21 మీటర్ల ఎత్తులో రాయదుర్గ, మైండ్ స్పేస్ జంక్షన్‌ను దాటడం పెద్ద సవాలుతో కూడుకున్న విషయమన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకమైన స్పాన్‌ని అక్కడే నిర్మించేందుకు ప్రయత్నం చేయనున్నట్లు రెడ్డి చెప్పారు. ఇవన్నీ క్లిష్టమైన సవాళ్లే అయినా.. ఇంజనీరింగ్ నిపుణులు అన్నింటినీ తప్పకుండా పరిష్కరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రూ.6,250కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మెట్రోకు పూర్తి నిధులు రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది.

First Published:  27 April 2023 3:46 AM GMT
Next Story