Telugu Global
Telangana

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఓవైసీ నాలుగో తరం.. వచ్చే ఎన్నికల్లో నూరుద్దీన్ ఓవైసీ పోటీ!

అక్బరుద్దీన్ కుమారుడైన నూరుద్దీన్ ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఎంఐఎం పార్టీకి చెందిన సలార్ - ఎ - మిలత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు ట్రస్టీ, కార్యదర్శిగా పని చేస్తున్నారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఓవైసీ నాలుగో తరం.. వచ్చే ఎన్నికల్లో నూరుద్దీన్ ఓవైసీ పోటీ!
X

తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హైదరాబాద్‌ పాత నగరంలో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న ఏఐఎంఐఎం నుంచి పోటీ చేయడానికి ఓవైసీ కుటుంబంలోని నాలుగో తరం సిద్ధమైంది. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ కొడుకు నూరుద్దీన్ ఓవైసీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నూరుద్దీన్‌ను ఎన్నికల బరిలో దింపాలని ఎంఐఎం క్యాడర్ ఒత్తిడి తెస్తున్నది. ఇటీవల పార్టీ హెడ్ క్వార్టర్ దారుస్సలామ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఎంఐఎం కార్యకర్తలు నూరుద్దీన్ ఎంట్రీపై ప్రకటన ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ఓవైసీ సోదరులు మాత్రం ప్రస్తుతానికి ఈ విషయంపై స్పందించలేదు.

అక్బరుద్దీన్ కుమారుడైన నూరుద్దీన్ ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఎంఐఎం పార్టీకి చెందిన సలార్ - ఎ - మిలత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు ట్రస్టీ, కార్యదర్శిగా పని చేస్తున్నారు. నూరుద్దీన్‌ను 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బరిలోకి దింపాలని క్యాడర్ పట్టుబట్టింది. అయితే, ఇంకా చిన్న వయసు కావడంతో ఓవైసీ బ్రదర్స్ అప్పుడు పోటీకి నిరాకరించారు. ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నూరుద్దీన్‌కు టికెట్ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. చాంద్రాయణగుట్ట లేదా బహదూర్‌పుర నుంచి నూరుద్దీన్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. చాంద్రాయణ గుట్ట నుంచి గత ఐదు పర్యాయాలు వరుసగా నూరుద్దీన్ తండ్రి అక్బరుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు.

దారుస్సలాం కేంద్రంగా పని చేసే ఏఐఎంఐఎం 1927లో ఏర్పడింది. హైదరాబాద్ స్టేట్‌ నవాబు నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ వద్ద సలహాదారుడిగా పని చేసిన నవాబ్ మహ్మద్ నవాజ్ ఖాన్ ఈ పార్టీని స్థాపించారు. హైదరాబాద్‌లోని పాత సెటిలర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు అప్పట్లో ఆయన తెలిపారు. కాగా, 1957లో అసదుద్దీన్ ఓవైసీ తాత అబ్దుల్ వాహీద్ ఓవైసీ పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఏఐఎంఐఎం పార్టీకి నాయకుడిగా ఉన్నారు. వాహీద్ ఓవైసీ తర్వాత ఆయన కొడుకు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ.. సలార్-ఎ-మిలత్ (అధినేత)గా పార్టీని నడిపించారు. ఆయన మరణానంతరం ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ పార్టీ చీఫ్‌గా ఉన్నారు.

ఎంఐఎం పార్టీ తొలి సారి 1960లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి.. మల్లేపల్లి వార్డులో విజయం సాధించింది. అక్కడ నుంచి అబ్దుల్ వాహీద్ ఓవైసీ స్వయంగా పోటీ చేయడం విశేషం. ఇక 1962లో పత్తర్‌గట్టి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 1978లో చార్మినార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అప్పటికే హైదరాబాద్ పాత నగరంలో ఎంఐఎం పార్టీ బలంగా నాటుకొని పోయింది. దీంతో 1984లో తొలి సారి సలాహుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి 2004 వరకు ఆ సీటులో ఆయనే గెలుస్తూ వచ్చారు. ఆయన తర్వాత కొడుకు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందుతున్నారు. ఏఐఎంఐఎంకు ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 7 సీట్లు ఉన్నాయి.

First Published:  19 Jun 2023 3:15 AM GMT
Next Story