Telugu Global
Telangana

బీబీనగర్ ఎయిమ్స్‌కు 17 ఏళ్ల తర్వాత మోక్షం.. అసెంబ్లీ ఎన్నికల కోసమే కేంద్రం నాటకం!

నాలుగేళ్లుగా అరకొర వసతుల్లోనే విద్యార్థులు చదువుతున్నారు. పూర్తి స్థాయిలో అన్ని శాఖలు ఏర్పడకపోవడంతో పేషెంట్లు కూడా రావడానికి ఆసక్తి చూపించడం లేదు.

బీబీనగర్ ఎయిమ్స్‌కు 17 ఏళ్ల తర్వాత మోక్షం.. అసెంబ్లీ ఎన్నికల కోసమే కేంద్రం నాటకం!
X

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులకు 17 ఏళ్ల తర్వాత మోక్షం కలుగనున్నది. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో 17 ఏళ్ల క్రితం నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) రెండో క్యాంపస్ కోసం విస్తరణ పనులు మొదలు పెట్టారు. అయితే విభజన చట్టంలో భాగంగా ఏపీ, తెలంగాణ కోసం వేర్వేరు ఎయిమ్స్‌ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించారు. ఏపీలోని మంగళగరి ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేసుకొని సేవలు ప్రారంభించింది. అయితే తెలంగాణ ఎయిమ్స్ పట్ల మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.

అప్పటికే నిర్మించబడిని బిల్డింగ్స్‌తో సహా రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌కు కేటాయించిన స్థలాలను ఎయిమ్స్ కోసం బదిలీ చేసింది. అప్పటి నుంచి తాత్కాలిక క్యాంపస్ లోనే ఎయిమ్స్ సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే ప్రతీ బడ్జెట్‌లో తెలంగాణ ఎయిమ్స్‌కు నిధులు కేటాయించడంలో విఫలం అయ్యింది. ఇక ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రాబోతోండటంతో బీజేపీ హడావిడిగా నిర్మాణాలు ప్రారంభించింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ హడావిడిగా శంకుస్థాపనలు చేశారు. ఎయిమ్స్ కోసం కొత్తగా 19 భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఎయిమ్స్‌లో తొలి బ్యాచ్ 2019లో 50 సీట్లతో ప్రారంభమైంది. అయితే సరైర వసతులు లేనికారణంగా విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం అకడమిక్ బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. దీంతో పాటు ఆక్సిజన్ ప్లాంట్, ఇతర బిల్డింగ్‌ల నిర్మాణాన్ని రూ.300 కోట్లతో చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ కోసం నిర్మించి ఇచ్చిన భవనాలనే ఎయిమ్స్ కోసం వాడుతున్నారు. 201 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఎయిమ్స్ పూర్తి స్థాయిలో సిద్ధం అయితే రోజుకు 1,200 మంది ఔట్ పేషెంట్లకు సేవలు అందించే అవకాశం ఉంటుంది.

కోవిడ్ పాండమిక్ సమయంలో 20 బెడ్ల ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేశారు. వీటిని త్వరలో 76 బెడ్లకు విస్తరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందే నిర్లక్ష్యం వీడి నిధులు కేటాయించినట్లయితే ఇప్పటికల్లా ఎయిమ్స్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేది. సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు ఎయిమ్స్ కోసం నిధులు కేటాయించాలని కోరినా.. కేంద్రం స్పందించలేదు. ఇక డిసెంబర్‌లో ఎన్నికలు ఉండటంతో ఏప్రిల్‌లో హడావిడిగా శంకుస్థాపనలు చేశారు. దీన్ని ఎన్నికల్లో ప్రచారంగా వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు నిర్మాణాలను వేగవంతం చేశారనే విమర్శలు వస్తున్నాయి.

నాలుగేళ్లుగా అరకొర వసతుల్లోనే విద్యార్థులు చదువుతున్నారు. పూర్తి స్థాయిలో అన్ని శాఖలు ఏర్పడకపోవడంతో పేషెంట్లు కూడా రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లా తీర్చి దిద్దుతామని గతంలో హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ.. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు కావొస్తున్నా.. ఒక ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. ఒక వేళ ఈ ఏడాది ఎన్నికలు లేనట్లయితే.. ఈ హడావిడి శంకుస్థాపనలు కూడా జరిగేవి కావని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం ఆడుతున్న నాటకమే అని ఆరోపిస్తున్నారు.

First Published:  10 April 2023 2:25 AM GMT
Next Story