Telugu Global
Telangana

వ్యవసాయం దండుగ అన్న చోటే పండుగ అయ్యింది : మంత్రి కేటీఆర్

కరువు నేలగా అల్లాడిన తెలంగాణ ఇవ్వాళ దేశానికే బువ్వపెట్టే అన్నపూర్ణగా మారింది.

వ్యవసాయం దండుగ అన్న చోటే పండుగ అయ్యింది : మంత్రి కేటీఆర్
X

వ్యవసాయం దండుగ అన్న చోటు పండుగ అయ్యింది. నెర్రలు బారిన ఈ నేల దశాబ్ది లోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో సాధించిన ప్రగతిని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు.

కరువు నేలగా అల్లాడిన తెలంగాణ ఇవ్వాళ దేశానికే బువ్వపెట్టే అన్నపూర్ణగా మారింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రైతు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నకు అందిస్తున్న వరాల వల్లనే ఈ అద్భుతం ఆవిష్కృతమైందని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని చెప్పారు.

రైతు బంధుతో పంట పెట్టుబడి సాయం, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు వేదికలు, సకాలంలో ఎరువులు విత్తనాల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టులతో పుష్కలమైన నీరు అందుబాటులో ఉండటంతో తెలంగాణ ధాన్యాగారంగా మారిందని అన్నారు. పండించిన పంటనంతా రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నదని, అంతే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం, పింక్ విప్లవం, పసుపు విప్లవంతో అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయని అన్నారు.

65 లక్షల మంది రైతులకు రూ.66 వేల కోట్ల పెట్టుబడి సాయంగా.. రైతు బంధు పథకాన్ని అమలు చేసిన ఏకైన ప్రభుత్వం తమదే అని కేటీఆర్ చెప్పారు. ఒక్కో రైతుకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్రంలోని 1,00,782 రైతు కుటుంబాలకు రూ.5,039 కోట్లను పరిహారంగా చెల్లించిందని.. 27 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు.

రైతుకు ప్రతీ దశలో అండగా ఉండేందుకు 10,769 గ్రామాల్లో రైతు బంధు సమితులు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతీ 5 ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2,601 రైతు క్లస్టర్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగానే తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.09 ఎకరాలకు పెరిగిందని చెప్పారు.


First Published:  3 Jun 2023 8:44 AM GMT
Next Story