Telugu Global
Telangana

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో దూసుకుపోతున్న తెలంగాణ..

2014-15 ఆర్థిక సంవత్సరంలో 2912 కోట్ల రూపాయలు ఉన్న ఎగుమతులు, 2021-22నాటికి 7737 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానంగా పత్తిలో గణనీయమైన వృద్ధి కనపడుతోంది.

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో దూసుకుపోతున్న తెలంగాణ..
X

తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తులు ఏడాదికేడాది భారీగా పెరుగుతున్నాయి. ఏడేళ్లనాటి పరిస్థితులతో పోల్చుకుంటే రెట్టింపుకంటే ఎక్కువగా తెలంగాణ రికార్డులు సృష్టించింది. 2014-15తో పోలిస్తే 2021-22నాటికి తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు రెట్టింపయ్యాయి.

ఎనలేని ప్రోత్సాహం..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో ప్రభుత్వ ప్రోత్సాహం మెండుగా ఉంది. దాని ఫలితమే అధిక దిగుబడులు, ఇతర దేశాలకు అధిక ఎగుమతులు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 2912 కోట్ల రూపాయలు ఉన్న ఎగుమతులు, 2021-22నాటికి 7737 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానంగా పత్తిలో గణనీయమైన వృద్ధి కనపడుతోంది. 2014-15 లో 619కోట్ల రూపాయల పత్తి ఉత్పత్తి కాగా.. 2021-22నాటికి దాని విలువ 3053కోట్ల రూపాయలకు చేరుకుంది. తృణ ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, మాంసం ఉత్పత్తుల్లో కూడా తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించింది.

తెలంగాణలో ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహంతో పాటు ‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ పథకం ద్వారా ఈ పురోగతి సాధించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దేశంలోని వ్యవసాయ సేవా రంగంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు అధికారులు. పంట ఉత్పత్తుల శుద్ధితో, అదనపు విలువను కల్పించడం ద్వారా రైతుల ఆదాయం పెంచాలని ప్రభుత్వం భావించిడమే ఈ పురోగతికి కారణం. ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు ద్వారా అనుబంధ రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆహారశుద్ధి ప్రత్యేక మండళ్లు ఏర్పడ్డాయి.

ప్రపంచ వ్యాప్తంగా పత్తికి పెరిగిన డిమాండ్ తో పాటు, ఆరోగ్య సంరక్షణలో భాగంగా బియ్యం, జొన్నలు, గోధుమలు, తదితర తృణధాన్యాలకు ఇతర దేశాల్లో ఆదరణ పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పెరిగిన తర్వాత మాంసం ఎగుమతుల్లోనూ వృద్ధి స్పష్టమైంది. మొత్తం 33 జిల్లాల్లో కూడా ఆహారశుద్ధి ప్రత్యేకమండళ్లు ఏర్పాటయితే ఎగుమతులు మరింత విస్తరిస్తాయని అంచనా.

First Published:  14 Feb 2023 1:30 AM GMT
Next Story