Telugu Global
Telangana

తెలంగాణ ప్రభుత్వం దూకుడు.. మరో 8 కొత్త మెడికల్ కాలేజీల కోసం రూ.1,447 కోట్లు మంజూరు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చివరి దశలో ప్రారంభించాలని నిర్ణయించిన 8 కాలేజీల ఏర్పాటుకు రూ.1,447 కోట్ల నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం దూకుడు.. మరో 8 కొత్త మెడికల్ కాలేజీల కోసం రూ.1,447 కోట్లు మంజూరు
X

ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు మీద ఉన్నది. 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఒక సారి ప్రారంభించి 24 గంటలు గడవక ముందే మిగిలిన 8 కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు విడుదల చేసింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే సీఎం కేసీఆర్ లక్ష్యంలో భాగంగా నిన్నటితో 26 కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా సీట్లు పొందిన విద్యార్థులకు శుక్రవారం నుంచే తరగతులు ప్రారంభం అయ్యాయి. కొత్త వైద్య కళాశాలల ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మాట్లాడుతూ.. మిగిలిన 8 కాలేజీలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమై చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చివరి దశలో ప్రారంభించాలని నిర్ణయించిన 8 కాలేజీల ఏర్పాటుకు రూ.1,447 కోట్ల నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను ఇచ్చింది. ఈ మేరకు శనివారం వైద్యారోగ్య శాఖ జీవో జారీ చేసింది. 8 కాలేజీల నిర్మాణానికి ఈ రూ.1,447 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను కాలేజీ భవనాలు, ల్యాబ్స్, సెమినార్ హాల్స్, అనుబంధ ఆసుపత్రి భవనాలు, హాస్టల్స్, ఇతర మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు.

ఇప్పటికే 26 జిల్లాల్లో కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కాగా.. చివరి దశలో గద్వాల్, నర్సంపేట, భువనగిరి, నారాయణపేట్, ములుగు, మెదక్, మహేశ్వరం ప్రాంతాల్లో ఈ కొత్త కాలేజీలు రానున్నాయి. ఆయా కాలేజీల నిర్మాణాలకు, ఇతర సౌకర్యాల కల్పనకు ఎంత మేర ఖర్చు అవుతుందో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్ అండ్ బీ శాఖ అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. వారి అంచనాల మేరకే తాజాగా ప్రభుత్వం రూ.1,447 కోట్ల అంచనాలను ఆమోదించింది.

ఏ కాలేజీకి ఎంత?

గద్వాల - రూ.183 కోట్లు

నారాయణ్‌పేట్ - రూ.180 కోట్లు

ములుగు - రూ.180 కోట్లు

నర్సంపేట్ - రూ.183 కోట్లు

మెదక్ - రూ.180 కోట్లు

భువనగిరి - రూ.183 కోట్లు

మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా) - రూ.176 కోట్లు

కుత్బుల్లాపూర్ (మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా) - రూ.182 కోట్లు

మొత్తం : రూ.1,447 కోట్లు




First Published:  16 Sep 2023 11:24 AM GMT
Next Story