Telugu Global
Telangana

వెంకట్ రెడ్డి మెత్తబడినట్టేనా..? ప్రచారానికి సిద్ధమేనా..?

ప్రియాంక గాంధీతో తెలంగాణ నేతల సమావేశానికి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు. రేవంత్ రెడ్డితో కలసి కూర్చోవడం ఇష్టం లేకే ఆ భేటీకి వెళ్లలేదని చెప్పారు. అయితే ఆ తర్వాత ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు నేరుగా ఆమెతో ముఖాముఖి భేటీ అయ్యారు వెంకట్ రెడ్డి.

వెంకట్ రెడ్డి మెత్తబడినట్టేనా..? ప్రచారానికి సిద్ధమేనా..?
X

తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్. అందులోనూ కాంగ్రెస్ లో ఉన్న లుకలుకలు మరింత హాట్ టాపిక్. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారు. కానీ తమ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయబోనని ఇప్పటికే తేల్చి చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమి ఖాయమని, హుజూరాబాద్ లాగా 3, 4 వేల ఓట్లు వస్తే ఎక్కువని చెప్పారు. ఈ క్రమంలో అధిష్టానంతో ఓ దఫా మీటింగ్ కి కూడా ఆయన డుమ్మా కొట్టారు. దీంతో అసలు వెంకట్ రెడ్డి పార్టీలో ఉంటారా, ఉండరా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఆయన మెత్తబడినట్టు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ సమావేశం తర్వాత వెంకట్ రెడ్డి మాట మారింది. పార్టీకోసం కలసి పనిచేయాలని తనకు ప్రియాంక సూచించారని, ఏ కష్టమొచ్చినా డైరెక్ట్ గా తన వద్దకే రావాలని ఆమె హామీ ఇచ్చారని అంటున్నారు.

ప్రియాంక గాంధీతో తెలంగాణ నేతల సమావేశానికి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు. రేవంత్ రెడ్డితో కలసి కూర్చోవడం ఇష్టం లేకే ఆ భేటీకి వెళ్లలేదని చెప్పారు. అయితే ఆ తర్వాత ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు నేరుగా ఆమెతో ముఖాముఖి భేటీ అయ్యారు వెంకట్ రెడ్డి. ఆమాత్రం తనకు ప్రయారిటీ ఇచ్చినందుకు సంబరపడిపోతున్నారు. అందుకే కాస్త మెత్తబడ్డారని అంటున్నారు. ఈ భేటీలో తన మనసులో మాటలన్నీ బయటపెట్టానని చెప్పారు వెంకట్ రెడ్డి. సీనియర్ అయిన తనకు అవకాశం ఇవ్వడంలేదని, పార్టీలు మారి వచ్చినవారికి అధ్యక్ష పదవి ఇచ్చారని ఆయన ప్రియాంకకు చెప్పారట. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, టీమ్ వర్క్ తో అందరూ కలసి పనిచేయాలని తనతో చెప్పారని అంటున్నారు వెంకట్ రెడ్డి.

మొత్తమ్మీద మునుగోడు ఉప ఎన్నిక వేళ రాజగోపాల్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ లో ఉన్నా కూడా మౌనంగా ఉంటాడన్న విషయం ఆ పార్టీని ఇన్నాళ్లూ ఇబ్బంది పెట్టింది. డైరెక్ట్ గా ప్రియాంక గాంధీని కలసిన తర్వాత వెంకట్ రెడ్డి కొత్త ఉత్సాహంతో ఉన్నారు. అంతా సర్దుకుంటాయంటున్నారు. దీంతో ఆయన ప్రచార బరిలో కూడా దిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మునుగోడులో ప్రియాంక సభకు వెంకట్ రెడ్డి ముందుండి అన్ని వ్యవహారాలు చక్కబెట్టే పరిస్థితి వస్తుందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి కూడా ఇదే కావాల్సింది. ప్రస్తుతానికి వెంకట్ రెడ్డి సమస్య సర్దుబాటయితే, ఆ తర్వాత ఎగిరెగిరి పడేవారందరి తోకలు ఎలా కత్తిరించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ప్రస్తుతం కాస్త సైలెంట్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  25 Aug 2022 2:38 AM GMT
Next Story