Telugu Global
Telangana

స్వతంత్ర భారతంలో బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ..

వజ్రోత్సవ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపున‌కు విశేష స్పందన వచ్చిందని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ కార్మికులతో 1.2 కోట్ల జెండాలను ప్రభుత్వమే తయారు చేయించి ప్రతి ఇంటికీ పంచి పెట్టిందని చెప్పారు.

స్వతంత్ర భారతంలో బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ..
X

స్వతంత్ర భారతావనిలో తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అన్నారు సీఎం కేసీఆర్. గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని వినిపించారాయన. వజ్రోత్సవాల వేళ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు, యావత్ భారతజాతికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు కేసీఆర్. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భం ఇది అని చెప్పారు.

హర్ ఘర్ తిరంగా..

వజ్రోత్సవ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపున‌కు విశేష స్పందన వచ్చిందని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ కార్మికులతో 1.2 కోట్ల జెండాలను ప్రభుత్వమే తయారు చేయించి ప్రతి ఇంటికీ పంచి పెట్టిందని చెప్పారు. యావత్ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణశోభితమై మెరిసి మురిసి పోతోందని అన్నారాయన. భారత స్వాతంత్ర పోరాటాలను, ఆదర్శాలను, విలువలను నేటితరానికి సవివరంగా తెలియజేయాలనే సంకల్పంతో ఆగస్ట్ 8 నుంచి 22 వరకు ఉత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు కేసీఆర్.

తెలంగాణ వీరులు..

స్వాతంత్ర పోరాటంలో త్యాగధనులైన జాతీయ నాయకులను స్మరించుకుంటూనే.. తెలంగాణ గడ్డపై పుట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను గుర్తు చేశారు కేసీఆర్. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. స్వాతంత్రోద్యమ సమయంలో హైదరాబాద్ ను సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా తెహజీబ్ గా అభివర్ణించారని, తెలంగాణ ప్రజలకు అది గర్వకారణం అని అన్నారు కేసీఆర్.

బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ..

సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని గుర్తు చేశారు కేసీఆర్. అన్ని రంగాలకు 24 గంటలపాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు కేసీఆర్. 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా అవతరించిందని గుర్తు చేశారు. 100 శాతం గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. గొర్రెల పెంపకంలో దేశంలోనే తెలంగాణ నెంబర్-1 స్థానంలో ఉందన్నారు. ఉత్పత్తిరంగంలో వృద్ధిరేటు 12.01 కాగా, ఐటీ రంగం ఎగుమతుల్లో దేశంలోనే అత్యథిక వృద్ధిరేటు 26.14 గా నమోదైందని చెప్పారు. హరితహారంతో తెలంగాణలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోందన్నారు కేసీఆర్. తెలంగాణ అవతరించిన 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు కాగా, 2021 నాటికి 1 లక్షా 84 వేల కోట్ల రూపాయలకు రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. సొంత పన్నుల ఆదాయంలో 11.5శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో జీఎస్డీపీ 5.05 లక్షల కోట్లు కాగా.. ఇప్పుడది 11.48 లక్షల కోట్ల‌కు చేరిందని చెప్పారు. తెలంగాణ వృద్ధి రేటు భారతదేశ వృద్ధిరేటుకంటే 27 శాతం అధికంగా ఉందన్నారు. తలసరి ఆదాయం లక్ష రూపాయలనుంచి 2.75 లక్షల రూపాయలకు పెరిగిందని చెప్పారు. జాతీయ తలసరి ఆదాయం కంటే, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 84శాతం అధికంగా ఉందన్నారు కేసీఆర్.

10 లక్షల మందికి ఆసరా పింఛన్లు..

రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 లక్షలమందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయని, వజ్రోత్సవ సందర్భంలో మరో 10లక్షలమందికి అదనంగా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు కేసీఆర్. లబ్దిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని అన్నారు.

దళితుల జీవితాల మార్పుకోసం దళితబంధు పథకాన్ని అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు కేసీఆర్. దళితబంధు పథకాన్ని కేవలం సంక్షేమ పథకంగానే కాకుండా, సామాజిక ఉద్యమంగా అమలు పరుస్తున్నట్టు తెలిపారు. దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో 'దళిత రక్షణ నిధి'ని కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. మొత్తం 2 లక్షల కుటుంబాలకు దళితబంధు ప్రయోజనాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు.

కల్యాణలక్ష్మి - షాదీముబారక్, గొర్రెల పంపిణీ పథకం, మత్స్యకారులకు లబ్ది చేకూర్చే పథకం, గౌడ సోదరులకోసం, నేతన్నలకోసం.. ఇలా వివిధ వృత్తులకు ప్రేరణనిస్తూ అందిస్తున్న పథకాలను వివరించారు కేసీఆర్. భారతదేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అరుదైన రికార్డ్ సృష్టించిందని చెప్పారు కేసీఆర్. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతకానితనంతో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయాయని, ఫ్లోరైడ్ బాధితుల తరపున నల్లగొండ నగారా పేరుతో తాను చేసిన ఉద్యమాన్ని గుర్తు చేశారు కేసీఆర్. మిషన్ భగీరథతో 100 శాతం ఇళ్లకు మంచినీరు అందిస్తూ.. తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చామని చెప్పారు. బంకించంద్రుడు వందేమాతర గీతంలో పేర్కొన్న సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలాం.. అన్న భావనను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసి చూపించిందని చెప్పారు కేసీఆర్.

రైతులకు ఆసరా..

తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చారిత్రాత్మక రైతుబంధు పథకం విశ్వవేదికపై కూడా ప్రశంసలు అందుకున్నదని తెలిపారు కేసీఆర్. ఐక్యరాజ్య సమితి రైతుబంధు పథకాన్ని అత్యుత్తమ పథకంగా కొనియాడిందని చెప్పారు. రైతు మీద పైసా భారం వేయకుండా రైతు బీమా ప్రీమియం మొత్తం 100 శాతం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేదని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాలకు పైగా సాగునీటి సౌకర్యం కల్పించిందన్నారు.

విద్య, వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తు చేశారు కేసీఆర్. రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్టమస్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, ఆయా పండుగల సందర్భంగా పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా అమలు కావడం కోసం ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాద్ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగిందని చెప్పారు.

ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోందని, 1500 కు పైగా పెద్ద, చిన్న ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయని చెప్పారు. ఐటీ ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. క్రీడారంగంలో కూడా తెలంగాణ దూసుకుపోతోందని, కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

అది అవగాహన రాహిత్యం..

తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికం చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతో, కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు కేసీఆర్. కేంద్ర రాష్ట్రాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారని, అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారని, కానీ ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోందని చెప్పారు కేసీఆర్. కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందన్నారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, కేంద్రం ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు "ఉచితాలు" అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం అని అన్నారు కేసీఆర్.

తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇక్కడి ప్రజలు కడుపునిండా తింటూ, కంటినిండా నిద్ర పోతున్నారని, ప్రశాంతంగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్. ఈ కీలక సమయంలో ఏ వర్గాన్నీ విస్మరించకుండా సకలజనులను విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు నడిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని చెప్పారు. విశ్వకవి రవీంద్రుడు భగవంతునికి చేసిన ప్రార్థనలోని ఉదాత్త విలువలను మళ్లీ మననం చేసుకుంటూ.. స్వాతంత్ర ఉద్యమ ఆశయాలను కాపాడుకోవడం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు కేసీఆర్.

First Published:  15 Aug 2022 6:58 AM GMT
Next Story