Telugu Global
Telangana

ఇప్పట్లో వలసలు కష్టమే.. సీన్ మార్చేసిన ఫామ్‌హౌస్ ఘటన

అన్ని పార్టీలు అసంతృప్త నేతలను బుజ్జగించే పని పెట్టుకున్నాయి. అయినా సరే ఇటీవల పలువురు కీలక నేతలు టీఆర్ఎస్, బీజేపీలో పార్టీలు మారారు. ఈ వలసల కారణంగా బీజేపీలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది.

ఇప్పట్లో వలసలు కష్టమే.. సీన్ మార్చేసిన ఫామ్‌హౌస్ ఘటన
X

తెలంగాణ రాజకీయాల్లో ఫామ్‌హౌస్ ఘటన ఒక కుదుపు కుదిపింది. అక్కడ ఏం జరిగింది? ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగాయా? ఎంత మేర డబ్బు దొరికింది? దీని వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలను పక్కన పెడితే. ఈ ఘటన కారణంగా రాజకీయా పార్టీలన్నింటికీ ఒక మేలు మాత్రం జరిగింది. ఇటీవల అధికార టీఆర్ఎస్‌తో సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వలసలపై వ్యాఖ్యలు చేస్తున్నాయి. త్వరలో మా పార్టీలోకి ఇంత మంది చేరబోతున్నారు. ఇక మీ పార్టీ పని ఖతమ్ అంటూ కొందరు నేతలు బహిరంగంగానే మాట్లాడారు. పలు పార్టీలు అసలు ఈ ఫిరాయింపులకు ఎట్లా అడ్డు కట్ట వేయాలని మదనపడ్డాయి.

అన్ని పార్టీలు అసంతృప్త నేతలను బుజ్జగించే పని పెట్టుకున్నాయి. అయినా సరే ఇటీవల పలువురు కీలక నేతలు టీఆర్ఎస్, బీజేపీలో పార్టీలు మారారు. ఈ వలసల కారణంగా బీజేపీలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. కీలకమైన నేతలు అధికార టీఆర్ఎస్ గూటికి చేరడంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోలేదు. కానీ, ఫామ్‌హౌస్ ఘటన కారణంగా ప్రస్తుతానికి అన్ని పార్టీలకు ఈ వలసల గండం తప్పినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ నుంచి ఆ పార్టీలోని కీలక నేతలు వలసలపై మాట్లాడారు. త్వరలో మా పార్టీలో నలుగురు కీలక నేతలు చేరతారు. ఉపఎన్నిక ఫలితం తర్వాత ఈ చేరికలు మరింతగా పెరుగుతాయని కూడా వ్యాఖ్యానించారు.

ఇక పార్టీ నాయకులు ఇప్పట్లో వలసలపై మాట్లాడే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఊరికే వలసలపై మాట్లాడటం వల్లే ఫామ్‌హౌస్ ఘటన జరిగిన వెంటనే బీజేపీ నాయకులపై అందరూ వేలెత్తి చూపడం ప్రారంభించారు. అంతకు ముందు తాము మాట్లాడిన మాటలే తమను దోషులుగా మార్చాయని బీజేపీ నాయకులు కూడా గ్రహించారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రయత్నించిందనే అపవాదు మూటగట్టుకోవల్సి వచ్చింది. దీనిపై హైకమాండ్ ఇంత వరకు స్పందించక పోయినా.. రాష్ట్ర బీజేపీ మాత్రం వలసల వ్యాఖ్యలు చేయడం బంద్ చేసింది. ఇప్పట్లో ఇతర పార్టీల నాయకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు అధికార టీఆర్ఎస్‌లోని అసంతృప్తులు పార్టీ మారే ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నట్లే. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అయితే ప్రతీ ఒక్కరు తమను అనుమానంగా చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము కూడా భారీగా డబ్బు తీసుకొని పార్టీ మారినట్లు ప్రజల్లోకి సందేశం పోతుందని భయపడుతున్నారు. పార్టీ మారడంపై ఏ కారణం చెప్పినా ఇప్పట్లో ఎవరూ నమ్మే అవకాశం కూడా లేదు. బీజేపీ రూ. వందల కోట్లు పార్టీ మారే వారికి ఇస్తోందనే ఆరోపణలు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో బలపడింది. ప్రజల్లో కూడా కాంట్రాక్టులు, పదవులు ఇచ్చి నాయకులను ఆకర్షిస్తోందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనవసరంగా పార్టీ మారి ఉన్న మంచి ఇమేజ్ పోగొట్టుకోవడం ఎందుకని నాయకులు ఆలోచిస్తున్నారు.

ఫామ్‌హౌస్ ఘటనలో ఏం జరిగినా.. ప్రస్తుతానికి బీజేపీ మాత్రం వలసలపై మాట్లాడకపోవచ్చని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు కొన్నాళ్లు విరామం ప్రకటించకపోతే రాష్ట్ర ప్రజలు బీజేపీని అనుమానంగా చూసే అవకాశం ఉందని అంటున్నారు. నిజంగా పార్టీ మారాలని అనుకున్న నాయకులకు కూడా ఇప్పుడే వద్దని చెబుతున్నట్లు తెలుస్తున్నది. టీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకునే విషయం కొన్నాళ్లు పక్కన పెట్టే అవకాశం ఉన్నది. ఫామ్‌హౌస్ ఘటనపై పార్టీ శ్రేణులను మాట్లాడవద్దని ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలో ఆ పార్టీ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఏదేమైనా ఫామ్‌హౌస్ ఘటనతో కొన్నాళ్ల పాటు వలసలకు బ్రేక్ పడుతుందనేది మాత్రం నిజం.

First Published:  28 Oct 2022 2:15 AM GMT
Next Story