Telugu Global
Telangana

పాతికేళ్ల త‌ర్వాత‌.. ల‌క్ష్మణ్, కిషన్ రెడ్డి లేకుండానే బీజేపీ పోటీ

ముఖ్య‌నేత‌లంతా తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ముందుగా పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం చెప్పినా ల‌క్ష్మ‌ణ్‌, కిష‌న్‌రెడ్డి మాత్రం ఈసారి పోటీకి దూరంగా ఉండ‌టానికి ఒప్పించుకున్నారు.

పాతికేళ్ల త‌ర్వాత‌.. ల‌క్ష్మణ్, కిషన్ రెడ్డి లేకుండానే బీజేపీ పోటీ
X

కె.లక్ష్మణ్.. రాజ్య‌స‌భ స‌భ్య‌డు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, జి.కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. తెలంగాణ‌లో బీజేపీకి వీళ్లిద్ద‌రూ రెండు క‌ళ్లు. వీళ్లిద్ద‌రూ లేకుండా గ‌త పాతికేళ్ల‌లో ఏనాడూ బీజేపీ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బడింది లేదు. అలాంటిది ఈసారి ఆ రికార్డును క‌మ‌లం పార్టీ పెద్ద‌లే బ‌ద్ద‌లుకొట్టారు. ముఖ్య‌నేత‌లంతా తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ముందుగా పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం చెప్పినా ల‌క్ష్మ‌ణ్‌, కిష‌న్‌రెడ్డి మాత్రం ఈసారి పోటీకి దూరంగా ఉండ‌టానికి ఒప్పించుకున్నారు.

ల‌క్ష్మ‌ణ్ 7సార్లు.. కిష‌న్ రెడ్డి 6సార్లు పోటీ

1994 నుంచి 2018 వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌తి అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ల‌క్ష్మ‌ణ్ పోటీ చేశారు. న‌గ‌రంలోని ముషీరాబాద్ నియోజకవర్గం ఆయ‌న అడ్డా. 2008 ఉప ఎన్నిక‌తో స‌హా మొత్తం ఏడుసార్లు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన లక్ష్మణ్ 1999, 2014లో గెలిచారు. మ‌రోవైపు కిష‌న్‌రెడ్డి మాత్రం గ‌త 24 ఏళ్ల‌లో ఆరుసార్లు పోటీ చేశారు. అయితే మూడు వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి బ‌రిలో నిలిచారు. 1999లో కార్వాన్ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన కిష‌న్‌రెడ్డి 2004లో హిమాయత్‌న‌గ‌ర్ నుంచి పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం హిమాయత్‌న‌గ‌ర్ ర‌ద్ద‌యి అందులో భాగంగా ఉన్న అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గంగా ఏర్ప‌డింది. దీంతో 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసి కిష‌న్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.

పార్టీ నాది.. అసెంబ్లీ నీది

ఒకానొక ద‌శ‌లో కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్ ఒక‌రు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉంటే మ‌రొక‌రు పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఉండేవారు. కొన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ బాధ్య‌త‌లు అటూ ఇటూ మారేవారు. అలా తెలంగాణ బీజేపీ బండిని రెండు చ‌క్రాల్లా న‌డిపేవారు. అయితే బండి సంజ‌య్‌కు పార్టీ నాయ‌క‌త్వం రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో వీరి హ‌వాకు బ్రేక్ ప‌డింది.

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మితో జాతీయ రాజ‌కీయాల్లోకి..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కిష‌న్ రెడ్డి, ల‌క్ష్మ‌ణ్ ఇద్ద‌రూ ఓడిపోయారు. త‌ర్వాత జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కిష‌న్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి ప‌ద‌వీ ఆయ‌న్ను వ‌రించింది. మ‌రోవైపు ల‌క్ష్మ‌ణ్ సీనియార్టీని గౌర‌వించిన క‌మ‌లం పెద్ద‌లు ఆయ‌న్ను రాజ్యసభకు పంప‌డ‌మే కాక పార్టీ ఓబీసీ మోర్చా అధ్య‌క్షుడి బాధ్య‌త‌లూ అప్ప‌గించారు. అలా ఇద్ద‌రూ అనూహ్యంగా రాష్ట్ర రాజ‌కీయాల నుంచి జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు గెలుస్తామో.. లేదో తెలియ‌ని ప‌రిస్థితుల్లో పోటీకి దిగ‌డం రిస్క‌ని భావించిన ఈ నేత‌లిద్ద‌రూ పోటీకి దూరంగా ఉన్న‌ట్లు రాజకీయ విశ్లేష‌కుల మాట‌.

First Published:  3 Nov 2023 5:42 AM GMT
Next Story