Telugu Global
Telangana

టీకాంగ్ కి మరమ్మతులు అవసరం.. సోనియాకు మరో లేఖాస్త్రం

నాయకులు ఎవరు ఏం చేసినా.. అది అంతిమంగా పార్టీకి లాభం చేకూర్చేది అయి ఉండాలన్నారు అద్దంకి దయాకర్. కొంతమంది వ్యక్తిగత లాభం కోసం చేపట్టిన కార్యక్రమాలు, చెబుతున్న మాటలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారాయన.

టీకాంగ్ కి మరమ్మతులు అవసరం.. సోనియాకు మరో లేఖాస్త్రం
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఢిల్లీకి పిలిపించుకుని ఇటీవలే క్లాస్ తీసుకున్నారు రాహుల్ గాంధీ. గ్రూపులు కట్టొద్దని, పార్టీ విషయాలు బహిరంగ వేదికలపై చర్చించొద్దని సూచించారు. ఆ తర్వాత పరిస్థితి కాస్త సర్దుబాటయిందని అనుకున్నారంతా. అంతలోనే సీనియర్ నేత అద్దంకి దయాకర్, నేరుగా సోనియాగాంధీకి లేఖ రాశారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీని నమ్ముకున్నవారిలో భరోసా కల్పించాలన్నారు. అవకాశవాదుల్ని ఏరిపారేయాలని చెప్పారు. అయితే సోనియాకు రాసిన ఆ లేఖను మీడియాకు కూడా విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

గతంలో కూడా అద్దంకి దయాకర్, నేరుగా సోనియా గాంధీకి పార్టీ వ్యవహారాలపై లేఖ రాశారు. మరోసారి ఆయన తాజా లేఖతో వార్తల్లోకెక్కారు. నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, ఎవరినీ వేలెత్తి చూపించకపోయినా.. సీనియర్లకు అన్యాయం జరుగుతోందంటూ ఆయన ఆవేదన బయటపెట్టారు. నమ్ముకున్నోళ్లని పార్టీ గుర్తించాలన్నారు. అవకాశవాదులపై ఓ కన్నేసి ఉంచాలన్నారు.

వ్యక్తిగత లాభం పార్టీకి చేటు..

నాయకులు ఎవరు ఏం చేసినా.. అది అంతిమంగా పార్టీకి లాభం చేకూర్చేది అయి ఉండాలన్నారు అద్దంకి దయాకర్. కొంతమంది వ్యక్తిగత లాభం కోసం చేపట్టిన కార్యక్రమాలు, చెబుతున్న మాటలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారాయన. అలాంటి వారిని కట్టడి చేయాలని సోనియాను తన లేఖలో కోరారు. తెలంగాణ‌ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అయినా, ఆ స్థాయిలో లాభం చేకూరలేదని.. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్ననేతలకు సముచిత స్థానం కల్పించాలన్నారు దయాకర్.

అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమివ్వాలని, వారికోసం మేనిఫెస్టోలో కొన్ని పథకాలు చేర్చాలని కోరారు అద్దంకి దయాకర్. అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలో మార్చేందుకు.. ఉద్యమకారులను గుర్తించి అవకాశాలివ్వాలని కోరారు. కాంగ్రెస్ నేతల్ని ఆకర్షించేలా బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న నేతలకు కీలక పదవులు అప్పగించాలని సోనియాను కోరారు. నిరుద్యోగ సమస్యను ప్రముఖంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రైతు డిక్లరేషన్ విషయంలో కూడా మరింత ప్రచారం జరగాలన్నారు. మొత్తమ్మీద నమ్మకం, నిబద్ధత, ఉద్యమ నాయకత్వం అంటూ.. అద్దంకి దయాకర్ రాసిన లేఖ కాంగ్రెస్ వర్గాల్లో సంచలనంగా మారింది.

First Published:  16 Aug 2023 4:51 AM GMT
Next Story