Telugu Global
Telangana

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి అలవాటే.. - ప్రకాష్ రాజ్

తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి అలవాటే.. - ప్రకాష్ రాజ్
X

బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ భారతీయ జనతా పార్టీ అనుసరించే విధానాలను తరచూ ఎండగడుతూనే ఉంటారు. సందర్భం వచ్చిన ప్రతీసారి ఆయన బీజేపీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ ఉంటారు. ట్విట్టర్ లో జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన వేసే ట్వీట్లు వైరల్ గా మారుతుంటాయి. తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుండగా, ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని.. అంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. గతంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఇదేవిధంగా చేశారని, ప్రస్తుతం తెలంగాణలోనూ చేస్తున్నారని అన్నారు.

ఆ దొంగలకు ఇక వేరే పని తెలియదని, అన్ని చోట్ల చేసినట్లే ఇక్కడా చేస్తున్నారని అన్నారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్రలో ఇలాగే చేశారని ప్రస్తుతం తెలంగాణలో చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు ప్రశ్నించాలని ప్రకాష్ రాజ్ సూచించారు.

Next Story