Telugu Global
Telangana

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ దాడులు.. - విస్తుపోయేలా అక్రమాస్తులు

సోదాల్లో ప్యాకింగ్‌లలో భద్రపరిచిన 2 కిలోల బంగారు ఆభరణాలు, 60కి పైగా ఖరీదైన గడియారాలు, 40 వరకు ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్లు, బ్యాంకుల్లో కోట్ల రూపాయల్లో డిపాజిట్లు, పదుల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్లు, భూముల పత్రాలు గుర్తించారు.

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ దాడులు.. - విస్తుపోయేలా అక్రమాస్తులు
X

తెలంగాణ ఏసీబీ అధికారులు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుదీర్ఘంగా నిర్వహించిన ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆయన ఇంట్లో దొరికిన నగదును లెక్కించేందుకు ఏకంగా కౌంటింగ్ మెషీన్లను తెప్పించి మరీ లెక్కించడం గమనార్హం. ఈ దాడుల్లో గుర్తించిన ఆస్తుల విలువ ఏకంగా రూ.100 కోట్ల పైగానే ఉందంటే ఏ స్థాయిలో అక్రమాస్తులు సంపాదించారనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఈ దాడులు జరిగింది హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం మాజీ డైరెక్టర్‌ ఎస్‌.బాలకృష్ణ ఇంటిపై. ఆయన గతంలో ఎంఏయూడీలో ఇన్‌చార్జి డైరెక్టర్‌గానూ ప‌నిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యదర్శిగా ఉన్నారు.

ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామునే 14 బృందాలుగా రంగంలోకి దించి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ మణికొండ పుప్పాలగూడలోని ఆదిత్య పోర్ట్‌వ్యూ విల్లాలోని బాలకృష్ణ నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం రాత్రి వరకు సోదాలు చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలు, రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని బీరువాల్లో రూ.500, రూ.200, రూ.100 నోట్ల కట్టలు పెద్ద ఎత్తున లభ్యం కావడంతో వాటిని లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లను తీసుకురావాల్సి వచ్చింది. బుధవారం రాత్రి వరకు లెక్కించిన నగదును రూ.40 లక్షలుగా గుర్తించారు. ఇప్పటివరకు ప్రకటించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని, సోదాలు మొత్తం పూర్తయితే ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సోదాల్లో ప్యాకింగ్‌లలో భద్రపరిచిన 2 కిలోల బంగారు ఆభరణాలు, 60కి పైగా ఖరీదైన గడియారాలు, 40 వరకు ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్లు, బ్యాంకుల్లో కోట్ల రూపాయల్లో డిపాజిట్లు, పదుల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్లు, భూముల పత్రాలు గుర్తించారు. బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా దాడులు నిర్వహించిన ఏసీబీ.. బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యుల పేరిట పలు బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. వాటిని తెరిస్తే మరిన్ని ఆస్తులు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. బినామీల పేరిట కూడా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు.

First Published:  25 Jan 2024 5:38 AM GMT
Next Story